రాజకీయ రణక్షేత్రంగా రామతీర్థం.. విజయసాయిరెడ్డి కారుపై దాడి, అద్దాలు ధ్వంసం..!

విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత నెలకొంది. అగ్ర నేతల పర్యటనలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. రామతీర్థంలోని శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటనను పరిశీలించేందుకు వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు.  

ఈ దాడిలో ఎంపీ విజయసాయిరెడ్డి కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడిని అడ్డుకున్న పోలీసులపై కూడా టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. అంతకు ముందు ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం ఆలయాన్ని సందర్శించారు. వైసీపీ శ్రేణులతో కలిసి ఘటన జరిగిన ప్రాంతాన్ని, కొండ పక్కన ఉన్న కొలను ప్రాంతాన్ని పరిశీలించారు. 

ఇక టీడీపీ అధినేత చంద్రబాబును విజయనగరంలో పోలీసులు అడ్డుకున్నారు. విజయసాయి రెడ్డి రామతీర్థం ఆలయంలో వెళ్లిన సమయంలో చంద్రబాబును అనుమతిస్తే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండటంతో విజయనగరంలోనే ఆయన్ను నిలిపేశారు. విజయసాయిరెడ్డి వెళ్లపోయిన తర్వాత చంద్రబాబు కాన్వాయ్ కు పోలీసులు క్లియరెన్స్ ఇచ్చారు. 

Leave a Comment