‘భారత రాజ్యాంగాన్ని మార్చాలి’.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తాను పెట్టిన ప్రతిపాదనపై చర్చ జరగాలని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో కొత్త ఆలోచన, కొత్త దిశ, కొత్త రాజ్యాంగం అవసరం ఉందని తెలిపారు. దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని తాను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. 

75 ఏళ్ల కింద రాసుకున్న రాజ్యాంగం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లేదని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీల చేతగానితనం వల్ల దేశం అంధకారంలో ఉందన్నారు. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితా అంటూ ఎవరేం చేయాలో స్పష్టంగా ఉందని, కానీ కేంద్రం రాష్ట్రాల అధికారాలు లాగేసుకుంటుందని కేసీఆర్ మండిపడ్డారు. 

బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలే అని, ఇది ఒక పనికిమాలిన చెత్త ప్రభుత్వం అని విమర్శించారు. అబద్ధాలతో, మత పిచ్చి రేపుతూ, ధర్మం పేరిట దేశాన్ని విభిజిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, త్వరలో తమ కార్యాచరణ ప్రారంభిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

 

Leave a Comment