ముస్లింలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోండి

విజయవాడ పోలీస్ కమిషనర్ కు ముస్లిం సంఘాల వినతి

కరోనా వ్యాప్తి పేరుతో ముస్లింలు, ముస్లిం సంస్థల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ముస్లిం సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలను మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షి బ్లీ, జమాత్ ఇస్లాం రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ అహ్మెద్, జమీయతె ఉలేమా రాష్ట్ర కన్వీనర్ మౌలానా హుస్సేన్ మరియు ముస్లిం డెమోక్రాటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు ఎండీ ఫతాఉల్లాహ్ కలిసి ఫిర్యాదు చేశారు.  పూర్తి ఆధారాలు, పోస్ట్ లింక్ లు మరియు పోస్టుల స్క్రీన్ షాట్ ప్రింట్లను ఆయనకు అందజేశారు. 

జమాతే ఇస్లామీ సంస్థ ప్రతిష్ఠకు భంగం‌ కలిగించేలా కొన్ని ఐడీలు విషం చిమ్ముతూ ఆ పోస్ట్ ద్వారా ప్రజల్లో జమాతే  ఇస్లామీ హింద్, మరియు ఇతర సంస్థల పట్ల ప్రజల్లో ద్వేష భావాన్ని పెంపొందించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇటువంటి పోస్టుల ద్వారా ముస్లింల పట్ల ద్వేషం కలిగించే పోస్టులు తరచు వస్తున్నాయన్నారు. ఇలాంటి ప్రయత్నాలు మనదేశ సమగ్రతకు ,జాతీయ సమైక్యత భావనలను దెబ్బ తీస్తాయన్నారు. ఇది మనదేశ లౌకిక స్పూర్తి కి విఘాతం కలిగిస్తాయన్నారు. వీటికి సంబంధించిన 120 కిపైగా పోస్టులను పోలీస్ కమిషనర్ ముందు ఉంచారు. 

జమాతే ఇస్లామీ హింద్, జమాతే ఉలేమా దేశ ప్రజల మధ్య సోదరభావం, మతసామరస్యం పెంపొందించడానికి అనేక నిర్మాణాత్మక కార్యక్రమాలు చేస్తుందని ముస్లిం సంఘాల నాయకులు పేర్కొన్నారు.  ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అనేక సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. 

కరోనా వ్యాపించినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని, రాజ్యాంగ బద్ధంగా పని చేస్తున్న అనేక ముస్లిం స్వచ్ఛంద సంస్థలపై ఇలాంటి ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టి దేశ సమైక్యను, మత సామరస్యాన్ని పరిరక్షించాలని కోరారు. 

దీనిపై స్పందించిన పోలీస్ కమిషనర్ దీనిపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి పోస్టులు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మత సామరస్యాన్ని కాపాడాలని పేర్కొన్నారు.

Leave a Comment