భూగర్భ జలాల పరిరక్షణ కోసం ‘ప్రత్యేక యాప్‘ 

 రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాల పరిరక్షణ కోసం పలు ప్రాజెక్టుల నిర్మాణ పనులు, వాటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలన చేసేందుకు ప్రత్యేక యాప్ ను రూపొందించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఈ యాప్ ను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ తరహా యాప్ ను తయారు చేశామన్నారు. రానున్న 24 నెలల్లో ప్రాజెక్ట్ ల నిర్మాణాలకు సంబంధించి  ప్రత్యేక ప్రణాళికను ఇప్పటికే రూపొందించామన్నారు.

Uni-APP One Department యాప్ ద్వారా ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ పనులతో పాటుగా రాష్ట్రంలోని మిగతా ప్రాజెక్ట్ ల నిర్మాణల పనులను నిరంతరం పర్యవేక్షణ చేయవచ్చన్నారు. యాప్ ను ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా జలవనరులు, భూగర్భ జలాల స్థితిగతులను ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ యాప్ లో భౌతిక, ఆర్థిక పరమైన అంశాలను పొందుపరచడం జరిగిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 84 రకాల పనులు, పురోగతిని ఇందులో పొందు పరిచినట్లు మంత్రి వివరించారు. యాప్ ను ఉపయోగించి నిరంతర పర్యవేక్షణ చేసేందుకు అనుకూలంగా తయారు చేశామని ప్రకటించారు. భవిష్యత్తు తరాలకు జలవనరుల శాఖ మార్గదర్శకంగా నిలిస్తుందని వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, ఇఎన్ సి నారాయణ రెడ్డి, వాటర్ గ్రిడ్ డైరెక్టర్ పురుషోత్తమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Comment