గిరిజనుల సంక్షేమానికి లక్ష ఎకరాల అటవీ  భూములు

సమీక్షా సమావేశంలో డిప్యూటి సీఎం పుష్పశ్రీవాణి , అటవీశాఖ మంత్రి బాలినేనిశ్రీనివాసరెడ్డి

అమరావతి : రాష్ట్రంలోని అర్హులైన గిరిజనులందరికీ లక్ష ఎకరాల భూములను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటి సీఎం పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. సచివాలయంలోని 5వ బ్లాక్ లో ఉన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం అటవీశాఖ, గిరిజన సంక్షేమశాఖల రాష్ట్ర అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం పుష్పశ్రీవాణితో పాటుగా రాష్ట్ర అటవీ, విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. గత ఏడాది ఆగస్టులో  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటవీ హక్కుల చట్టంపై సమీక్ష నిర్వహించినట్లు మంత్రులు తెలిపారు. వచ్చే మార్చి 25 ఉగాది పండుగ నాటికి గిరిజనులకు లక్ష ఎకరాల అటవీ భూములను పంపిణీ చేయాలని సిఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. 

ఎన్నికల మేనిఫెస్టోలో కూడా గిరిజనులకు అటవీ భూముల పంపిణీ విషయాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు. అందుకనుగుణంగా చట్టంలో ముఖ్య భూమికను పోషిస్తున్న గిరిజన, అటవీ, రెవెన్యూశాఖలు కలిసి గిరిజనులకు లక్ష ఎకరాల భూములకు పట్టాలను ఇవ్వాల్సి ఉందని మంత్రులు వెల్లడించారు. అటవీశాఖకు, గిరిజనశాఖకు మధ్య  సమాచార పంపిణీలో ఆలస్యం వల్ల వచ్చిన వినతుల్లో కేవలం 3,800 ఎకరాలు వీలు ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి ఇరుశాఖల మంత్రులు, సంబంధిత శాఖల అధికారులను సమన్వయ పరుచుకొని వెంటనే చర్చించాలని ఆదేశాలు రావడంతో గురువారం ఆయా శాఖల అధికారులు సమీక్ష నిర్వహించారు. 

ఇప్పటికీ 73,240 దరఖాస్తులు..

రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15 ప్రాంతాల్లో ఉన్న అటవీ భూముల కోసం ఇప్పటి వరకు 73,240 దరఖాస్తులు వచ్చాయని అధికారులు గుర్తించారు. వీరికి 2,99,744 ఎకరాలు భూములను గుర్తించి పంపిణీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందులో ఉగాది నాటికి కనీసం లక్ష ఎకరాలను తొలి విడతలో పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళికలను తయారు చేయాలని  అటవీ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. నిర్ధిష్ట ప్రణాళికను తయారు చేసి త్వరిత గతిన లక్ష్యాలను చేరుకోవాలని ఆయా శాఖల ముఖ్య అధికారులు, జిల్లా స్థాయి అధికారులను మంత్రి ఆదేశించారు.

 

Leave a Comment