షాకింగ్ : గాలి ద్వారా కూడా కరోనా..! 

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కేవలం దగ్గు, తుమ్ముల నుంచి వెలువడే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుందని మనకు తెలుసు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే చెబుతుంది. అయితే  ఇప్పుడు గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందన్న షాకింగ్ విషయం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ గాలి ద్వారా ఇతరులకు సోకుతుందనేందుకు ఆధారాలు ఉన్నట్లు 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక లేఖ రాశారు. 

అతి సూక్ష్మ స్థాయి కణాలు వైరస్ ను గాలిలో మోసుకెళ్లగలవని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. లాక్ డౌన్ సడలింపులతో ప్రజలు మార్కెట్ లో తిరగడం ఎక్కువైందని, అందులో వైరస్ సోకిన వారు కూడా ఉంటారని తెలిపారు. దీన్ని బట్టి కరోనా వైరస్ గాలిలో ఎక్కువకాలం మనగలగడమే కాకుండా ఇతరులకు సోకుతుందని అర్థమవుతుందని చెప్పారు. వైరస్ కట్టడికి WHO ఇచ్చే సలహాలు సూచనల్లో మార్పులు చేయాలని వారు కోరారు. 

వైద్య ప్రక్రియల సమయంలో వెలువడే ఐదు మైక్రాన్ల కంటే తక్కువ సైజున్న తుంపర్ల ద్వారా వైరస్ సోకే అవకాశం ఉన్నట్లు తెలిపారు. జనసమూహం ఉన్న ప్రాంతాల్లో, భవనాల్లో వైరస్ గాలి ద్వారా సోకుతుందన్న వార్తకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక భౌతికదూరం పాటిస్తున్నప్పటికీ ఇళ్లలో, ఇతర ప్రాంతాల్లో మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. 

 

Leave a Comment