ఎక్కడా రాజీ పడొద్దు : సీఎం జగన్

కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో నాణ్యమైన వైద్య సేవలందాలని, ఆ కేంద్రాలలో అన్ని సదుపాయాలు సంతృప్తికరంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్‌–19 నివారణ చర్యలపై సీఎం జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. క్వారంటైన్‌ కేంద్రాలలోనూ ఏ లోటూ ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. రోగుల సదుపాయాలు, వారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో ఔషధాలు అందించే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చెప్పారు.

కరోనా మైల్డ్‌ పాజిటివ్‌ కేసులకు సంబంధించి రోగులకు వైద్య సేవలందించేందుకు అన్ని జిల్లాలలో కనీసం 3 వేల నుంచి 4 వేల బెడ్లు సిద్ధం చేశామని సమావేశంలో అధికారులు వెల్లడించారు. అయితే వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని, బెడ్లు, టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలని, రోజంతా వైద్య సేవలందేలా చూడాలని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాలతో కూడిన ఔషథాలు (మందులు) ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్దేశించారు.

వివరాలు సేకరించండి..

కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా గుర్తించిన ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు ఆరా తీయాలని ముఖ్యమంత్రి కోరారు. ఇళ్లలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని, ఆ సమాచారాన్ని వైద్య అధికారులకు తెలియజేసి అవసరమైన పరీక్షలు చేయించాలని, చికిత్స అందించాలని సూచించారు.

 అవగాహన పెంచండి..

కరోనాపై ప్రజల్లో ఉన్న భయాందోళనలు (స్టిగ్మా) తొలగి పోయేలా వారికి మరింత అవగాహన కల్పించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేయడం, తగిన పరీక్షలు చేయించుకోవడం, ఇళ్లలోనే ఉండి చికిత్స పొందవచ్చన్న విషయాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం నిర్దేశించారు.

Leave a Comment