శ్రీచైతన్య, నారాయణ కాలేజీలకు షాక్ 

 మూసేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు..

హైదరాబాద్: పలు ఇంటర్మీడియెట్ ప్రైవేట్ కాలేజీలపై తెలంగాణ హైకోర్టు కన్నెర్ర చేసింది. ముఖ్యంగా శ్రీచైతన్య మరియు నారాయణ కాలేజీలపై కోర్టు సీరియస్ అయ్యింది. వెంటనే 68 శ్రీచైతన్య మరియు నారాయణ కాలేజీలను మూయించేయాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్‌కు ఆదేశాలు జారీ చేసింది.

నిబంధనలను ఉల్లంఘించిన కాలేజీలు

బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్‌ నుంచి కాలేజీలకు ఎలాంటి అనుమతులు లేదా గుర్తింపు లేకుండా శ్రీచైతన్య, నారాయణ సంస్థలు పలు ప్రాంతాల్లో కాలేజీలను ప్రారంభించి అందులో విద్యార్థులకు అడ్మిషన్స్ ఇచ్చినట్లు తెలంగాణ హై కోర్టు గుర్తించింది.

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలో జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారణ చేసింది. మార్చి 28 తర్వాత అంటే విద్యార్థులకు ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయిన తర్వాత శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్‌కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు

ఈ మధ్యకాలంలో ప్రైవేట్ కాలేజీలు నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం హైకోర్టులో దాఖలైంది. ముఖ్యంగా శ్రీచైతన్య నారాయణకు సంబంధించిన జూనియర్ కాలేజీల్లో సరైన భద్రత లేదని ఫైర్ సేఫ్టీ, పరిశుభ్రతను పాటించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పిల్‌ దాఖలైంది.

బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిల్‌లో పిటిషనర్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 17న విచారణ చేసిన ధర్మాసనం ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులకు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల మధ్య ఏదైనా సమ్మతి కుదిరిందా అనే అనుమానం సైతం వ్యక్తం చేసింది. ఫిర్యాదులు అందినప్పటికీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ చర్యలు తీసుకోకపోవడంతో ఈ అనుమానం వ్యక్తం చేసింది న్యాయస్థానం. అంతేకాదు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ నుంచి గుర్తింపు లేకుండానే శ్రీ చైతన్య , నారాయణ సంస్థలు 29800 మంది విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు.

ఒక లేఖను ఆధారం చేసుకుని ఎలా అనుమతులు ఇచ్చారు..?

ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేని కాలేజీల్లో తరగతులు నిర్వహించమని చెబుతూ శ్రీచైతన్య, నారాయణ కాలేజీలు రాతపూర్వకంగా బోర్డుకు ఇచ్చాయి. ఈ లేఖ ఆధారం చేసుకుని తరగతులు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన ఇంటర్మీడియెట్ బోర్డుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఫిబ్రవరి 25కల్లా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెబుతూ నివేదిక సబ్మిట్ చేయాల్సిందిగా బోర్డును కోరింది.అయితే గురువారం రోజున కోర్టుకు వచ్చిన తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు…. నిబంధనలు పాటించని కాలేజీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపింది. అదే సమయంలో కాలేజీలను మూయించేందుకు కాస్త సమయం కావాలని కోర్టును కోరింది.

పరీక్షలు ముగియగానే ఆ కాలేజీలను మూయించండి

బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం వెంటనే నిబంధనలు పాటించని కాలేజీలను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అగ్నిమాపక నిబంధనలు పాటించని 68 శ్రీచైతన్య నారాయణ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగనున్నాయని బోర్డు తరపున వాదనలు వినిపించిన లాయర్ సంజీవ్ కుమార్ కోర్టుకు తెలిపారు.

ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 4 నుంచి 28 వరకు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు మూసివేయిస్తే పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌కు అవాంతరం ఏర్పడుతుందని కోర్టుకు తెలిపారు. బోర్డు చెప్పిన వాదనతో ఏకీభవించిన ధర్మాసనం పరీక్షలు ముగియగానే ఆ కాలేజీలను బంద్ చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు అగ్నిమాపక శాఖ ఎన్ని కాలేజీల్లో ఇన్స్‌పెక్షన్ నిర్వహించిందో కోర్టుకు నివేదిక సమర్పించాలని అదే సమయంలో ఆ కాలేజీల కండిషన్‌ కూడా వివరించాలని కోరుతూ కేసును ఏప్రిల్ 7కు వాయిదా వేసింది ధర్మాసనం.

 

Leave a Comment