పెట్రోలు, డీజిల్ ధరలు తక్షణం తగ్గించాలి  : కె ఇ కృష్ణ మూర్తి  

పెట్రోలు, డీజిల్ ధరలు నెలలో రెండుసార్లు పెంచి గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించడంపై  జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ నేత కె ఇ కృష్ణ మూర్తి డిమాండ్ చేశారు. గత నెలలోనే వ్యాట్‌లో సవరణలు చేసి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి, అది మరవక ముందే మరోసారి పెట్రోల్ ధరలు పెంచడం సరికాదని ఆయన సూచించారు. ఇప్పుడు పెట్రోల్ లీటర్‌పై 76 పైసలు, డీజిల్ లీటర్ రూ.1.07 పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం ధరలు పెంచి ప్రజలపై భారం మోపడమే పాలనలా మారిందని ఎద్దేవా చేశారు.    మాటలను మార్చడంలో ఘనుడు జగన్ అని మరోసారి రుజువయిందన్నారు.

మాట తప్పను మడమ తిప్పనన్న జగన్ ఇప్పుడు మాట, మడాన్ని అష్టవంకరలు తిప్పాడని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పెంచని విధంగా పెట్రోలు, డీజిలు ధరలు పెంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ప్రతిపక్షనాయకుడిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో పెట్రోలు, డీజిలు ధరలు ఉన్నందున తగ్గించాలని అసెంబ్లీలో మాట్లాడి ఆందోళనలు నిర్వహించిన సంగతి గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతిపక్ష నేతగా ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ, విద్యుత్ ధరలు నానాటికీ పెంచడం జగన్ పాలన్ చేతకాని తనానికి నిదర్శనమన్నారు.  జ్ఞాపకశక్తి కోల్పోయి ప్రవర్తించడం జగన్ కే చెల్లుబాటయిందన్నారు. పెంచిన పెట్రోలు, డీజిలు ధరలు తక్షణం తగ్గించి ప్రజలపై భారం లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోలు, డీజిలు ధరలు తగ్గించే వరకూ ప్రజల పక్షాన పోరాటానికి టీడీపీ సిద్ధం అని హెచ్చరించారు.

 

Leave a Comment