కరోనాతో స్కూల్స్ ముతపడటంతో రోడ్డుపై చెప్పులు అమ్ముతున్న స్కూల్ టీచర్..!

కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేసింది. లాక్ డౌన్ కారణంగా స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో విజయవాడలోని పడవలరేవు సెంటర్ సమీపంలో ఉన్న బీఆర్టీఎస్ రోడ్డుపై వెంకటేశ్వరరావు అనే ప్రైవేట్ స్కూల్ టీచర్  చెప్పులు అమ్ముకుంటున్నాడు. వెంకటేశ్వరరావు నగరంలోని మూడు ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు గణితాన్ని బోధించేవాడు. తిరిగి సాధారణ పరిస్థితికి రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో ఎటువంటి ఆదాయవనరులు లేక కొరియర్ సేవలు, ఇతర పనుల కోసం ప్రయత్నించానని వెంకటేశ్వరరావు తెలిపారు. అయితే ఎవరు అవకాశం ఇవ్వలేదన్నారు. తనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని, తన కుటుంబాన్ని పోషించడానికి పాదరక్షలు అమ్ముతున్నానని చెప్పాడు. 

చలించిపోయిన కలెక్టర్ ఇంతియాజ్..

నగరంలో గణితం మాస్టారు వీధి విక్రేతగా మారి పాదరక్షలను అమ్ముతున్నారని తెలిసి క్రిష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ చలించిపోయారు. వెంకటేశ్వరరావుకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం లేదా వ్యాపారం నిర్వహించుకునేందుకు రుణ సౌకర్యం కల్పిస్తానని, ఏది కావాలో నిర్ణయించుకుని తమ కార్యాలయానికి వచ్చి కలవాలని చెప్పారు. దీనిపై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను వ్యాపారం నిర్వహించుకునేందుకు రుణం మంజూరు చేయాలని కోరారు. తన పరిస్థితిని తెలుసుకుని ఎంతో అప్యాయతగా తనను కలుసుకుని సహాయపడేందుకు ముందుకు వచ్చిన కలెక్టర్ ఇంతియాజ్ కు వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. 

 

Leave a Comment