ప్లాస్మా ఇచ్చిన వారికి రూ.5వేలు : సీఎం జగన్

ప్రతి జిల్లాలో కోవిడ్ చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రుల్లో బెడ్లు, ఖాళీలు, భర్తీల వివరాలు ఆస్పత్రి హెల్ఫ్ డెస్క్ లో అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్‌ నివారణా చర్యల్లో భాగంగా క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహిాంచారు. సంబంధిత ఆస్పత్రుల్లో కూడా బ్లాక్ బోర్డు పెట్టి, ఆ ఆస్పత్రిలో బెడ్లు భర్తీ, ఖాళీల వివరాలను రాయలని సూచించారు. బెడ్లు దొరకలేదనే పరిస్థితి ఉండకూడదన్నారు. 

ప్లాస్మా థెరఫీపై కూడా బాగా అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సహించాలన్నారు. ప్లాస్మా ఇచ్చేవారికి రూ.5వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు. మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని తెలిపారు. 

కోవిడ్‌ కోసం నిర్దేశించిన 138 ఆస్పత్రుల యాజమాన్యంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు.  సూక్ష్మస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. హెల్ప్‌ డెస్క్‌లో ఉన్నవారికి ఓరియంటేషన్‌ బాగుండాలన్నారు. హెల్ప్‌ డెస్క్‌ ప్రభావవంతంగా పనిచేస్తే… చాలావరకు సమస్యలు తగ్గుతాయన్నారు. ఆస్పత్రుల మేనేజ్‌మెంట్‌పై బాగా దృష్టి పెట్టాలన్నారు. 

పిల్లలకు మాస్కులు ఇవ్వాలి..

సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు తెరిచే ప్రయత్నాలు చేస్తున్నామని, విద్యాకానుకతో పాటు.. పిల్లలకు మాస్కులు కూడా ఇవ్వాలని ఆదేశించారు. దీనికోసం వెంటనే మాస్కులు సిద్ధం చేయాలన్నారు.  మాస్కులు ఎలా వాడాలన్నదానిపై వారికి అవగాహన కూడా కల్పించాలన్నారు. 

Leave a Comment