జాగ్రత్తలతో తిరిగి కార్యకలాపాలు : సీఎం జగన్

కోవిడ్‌ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎక్కడెక్కడ ఎలాంటి విధానాలు పాటించాలన్న దానిపై స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రోటోకాల్స్‌ (ఎస్‌ఓపీ) తయారు చేయాలన్నారు. క్యాంపు కార్యాలయంలో కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జనగ్ సమీక్ష నిర్వహించారు. అదే విధంగా బస్సుల్లో పాటించాల్సిన ప్రోటోకాల్స్ తయారు చేయాలని, రెస్టారెంట్లు, మాల్స్ లో క్రమ, క్రమంగా తిరిగి కార్యకలాపాలు మొదలయ్యేలా ఎస్ఓపీ తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

భయాందోళనలు తగ్గాలి..

కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తగ్గాలంటే ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారు స్వయంగా ముందుకు పరీక్షలు, వైద్యం చేయించుకునే పరిస్థితి తీసుకురావాలని తెలిపారు. కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనుమానం వస్తే.. ఎవర్ని సంప్రదించాలన్న దానిపై పూర్తి వివరాలతో  కరపత్రం రూపొందించాలన్నారు. కరోనా రావటం తప్పు కాదని, అది పాపం కాదనే విషయాన్ని ప్రజలకు గట్టిగా తెలియజేయాలన్నారు.

వైఖరిలో మార్పు రావాలి

కరోనా వచ్చిన వారి పట్ల వివక్ష చూపడం, తక్కువగా చూడ్డం కూడా మానుకోవాలన్నారు. దీని కోసం తీసుకోవాల్సిన చర్యలు ఇప్పుడు ముఖ్యమైనవన్నారు. భవిష్యత్తుల్లో విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయికి కోవిడ్‌ పరీక్షలు జరగాలని ఆదేశించారు. 

వలస కూలీలపై ఉదారత

ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించి… రహదారుల మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న ఇతర రాష్ట్రాల వలస కూలీల స్థితిగతులపై సమావేశంలో చర్చించారు. మండుటెండలో పిల్లా, పాపలతో కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా నడుస్తున్న వలస కూలీల పరిస్ధితిని చూసి సీఎం చలించిపోయారు. రాష్ట్రం గుండా వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలని సీఎం జగన్ సూచించారు. వలస కూలీలు కోసం బస్సులు తిప్పడానికి సిద్ధం కావాలన్నారు. వలస కూలీలకు టిక్కెట్టు కూడా అడగవద్దని సీఎం ఆదేశించారు. నడిచివెళ్తున్న వలస కార్మికులు ఎక్కడ తారసపడ్డా వారిని బస్సులు ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలన్నారు. 

 

Leave a Comment