ఏపీ ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్..

ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు విషయంలో ఏపీ హైకోర్టు జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే కొనసాగించాలని ఆదేశించింది. ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టిపారేసింది. 

ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ కొనసాగుతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే.మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. 

గతంలో ఎస్ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేశారు. తర్వాత రాష్ట్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ముగిసిందని పేర్కొంటూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. న్యాయ శాఖ జీవో 31, పంచాయతీ రాజ్ శాఖ 617, 618 జీవోలు ఇచ్చాయి. దీంతో ఎస్ఈసీగా ఉన్న రమేష్ కుమార్ ని పదవీ నుంచి తొలగించారు. ఈక్రమంలోనే నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. 

Leave a Comment