పారిపోయేందుకు ప్రయత్నించి కిటికీలో ఇరుక్కుంది..!

కోవిడ్ కేర్ సెంటర్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి కిటికీలో ఇరుక్కుపోయింది ఓ యువతి.. కిటికీ గ్రిల్స్ మధ్య ఇరుక్కుని నరకం చూసింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి హైడ్రాలిక్ కట్టర్ సాయంతో గ్రిల్ తొలగించి యువతిని కాపాడారు. ఈ ఘటన పూణెలోని ఎరండ్వేన్ ప్రాంతంలోని కోవిడ్ కేరస్ సెంటర్ లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. 

కోవిడ్ కేర్ సెంటర్ లో ఓ 18 ఏళ్ల యువతి ఉండలేకపోయింది. దీంతో అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలో సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో నిద్ర లేచి కిటికీలో నుంచి బయటకు పారిపోవాలనుకుంది. పారిపోయేందుకు ఆ కిటికీ గ్రిల్ లోకి దూరింది. అయితే ఆ కిటికీ గ్రిల్ చిన్నది కావడంతో ఆ యువతి కిటికీలోనే ఇరుక్కుపోయింది. 

చాలా సేపు ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. ఇటు బయటకు రాలేక, లోపలికి వెళ్లలేక నరకం అనుభవించింది. ఆ తర్వాత కేకలు వేయడం మొదలుపెట్టింది. దీంతో అక్కడ ఉన్న వారు వచ్చి ఆ యువతిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. కానీ, లాభం లేకపోయింది. తర్వాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని హైడ్రాలిక్ కట్టర్ సాయంతో కిటికీ గ్రిల్ తొలగించి యువతిని రక్షించారు. 

Leave a Comment