హిందువులు అధికంగా ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా?

హిందూ దేవుళ్లలో ఎక్కువగా వినిపించే పేరు శ్రీరాముడు.. ఇక మన దేశంలో శ్రీరాముడు చుట్టూనే బోలెడంత రాజకీయం కూడా నడుస్తున్న సంగతి తెలిసిందే.. అయితే భారతదేశంలో ఏ దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తారనే దానిపై అమెరికాకు చెందిన ప్యూ రీసర్చ్ సెంటర్ సర్వే నిర్వహించింది. 2019 నవంబర్ నుంచి 2020 మార్చి మధ్యలో ఈ సర్వే జరిగింది. దాదాపు 30 వేల మందితో ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఫలితాలను ఇటీవల విడుదల చేశారు. 

ఈ సర్వే షాకింగ్ ఫలితాలను ఇచ్చింది. హిందువులు అధికంగా ఆరాధించేది మాత్రం శివుడు అని ఈ సర్వే ద్వారా తేలింది. పరమ శివుడిని అత్యధికంగా హిందువులు కొలుస్తారని, హిందువుల్లో 44 శాతం మంది శివుడ్ని ఆరాధిస్తారని సర్వే ఫలితం తేల్చింది. శివుడి తర్వాత హనుమంతుడిని 35 శాతం మంది, గణేషుడిని 32 శాతం మంది, లక్ష్మీదేవిని 28 శాతం, శ్రీకృష్ణుడిని 21 శాతం మంది, కాళీమాతను 20 శాతం మంది, ఆ తర్వాత శ్రీరాముడిని 17 శాతం మంది కొలుస్తారని సర్వే వెల్లడించింది. 

ఇంకా ఈ సర్వేలో అత్యధిక భారతీయులు తమకు ఇతర మతాలతో ఇబ్బంది ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే తమ పొరుగున ఉన్న వారు మాత్రం తమ మతస్థులైతే బాగుంటుందన్న భావనను వ్యక్తం చేశారట.. ఇలాంటి అభిప్రాయాన్ని చెప్పిన వారిలో జైనులు అధికంగా ఉన్నట్లు సర్వేలో పేర్కొన్నారు. 

సర్వేలో పాల్గొన్న హిందువుల్లో 77 శాతం మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. 73 శాతం మంది విధిని కూడా బలంగా నమ్ముతున్నట్లు వెల్లడించారు. సర్వే చేసిన హిందువుల్లో 89 శాతం మంది తమకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఐదు శాతం ముస్లింలు, హిందువులు మాత్రమే మత వివక్ష ఉటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం..

సర్వేలో అత్యధిక మంది హిందువులు దేవుడు ఒక్కడే అని, అయితే రూపాలు మాత్రమే వేరని పేర్కొన్నారు. 61 శాతం హిందువులు ఒకే దేవుడు ఉన్నాడని నమ్ముతుండగా, 7 శాతం మంది హిందువులు మాత్రమే వేర్వేరు దేవుళ్లను నమ్ముతున్నారని చెప్పారు. 66 శాతం ముస్లింలు, 68 శాతం క్రిస్టియన్లు, 57 శాతం సిక్కులు దేవుడు ఒక్కడే అని నమ్ముతారట.. అదేసమయంలో సర్వేలో పాల్గొన్న ముస్లింలలో 27 శాతం మంది ముస్లింలు పూర్వజన్మపై నమ్మకం ఉందని చెప్పారు. 

భారత్ లోని పశ్చిమ రాష్ట్రాల్లో హిందువులు గణేశుడిని ఇష్టదైవంగా భావిస్తున్నారు. కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో 15 శాతం మంది మాత్రమే ఇలా భావిస్తున్నారు. ఈశాన్యంలో 46 శాతం హిందువులు శ్రీకృష్ణుడిని ఇష్టదైవంగా భావిస్తుండగా.. దక్షిణాదిలో కేవలం 14 శాతం మంది ఉన్నారు. రాముడు అంటే ఇష్టమనే భావాలు ముఖ్యంగా సెంట్రల్ రీజియన్ లో 27 శాతం మంది ఉన్నారు. కానీ, ఇతర ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉన్నారు. ఈ సర్వే మొత్తంలో షాకింగ్ అంశం శ్రీరాముడిని ఆరాధిస్తామని చెప్పేవారు తక్కవగా ఉండటమే.. కానీ ఆయన చుట్టూనే దేశ రాజకీయాలు తిరగటం గమనార్హం.. 

 

Leave a Comment