ఎన్నికల వాయిదా కుట్రపూరితం : పేర్ని

మచిలీపట్నం: స్థానిక ఎన్నికలను కావాలనే వాయిదా వేశారని.. ఒక్క కరోనా కేసును అడ్డం పెట్టుకుని వాయిదా వేయడం కుట్రపూరితమని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే ఇలాంటి చర్యలు తీసుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయితే కేంద్రం నుంచి రూ. 4 వేల కోట్లు వచ్చేవన్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని కావాలనే హడావిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

టీడీపీ హయాంలో స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగలేదా? అని నాని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మళ్లీ స్థానిక ఎన్నికల్లోనూ వస్తాయని నాని దీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వాయిదా పడినంత మాత్రాన ఫలితాల్లో ఎలాంటి మార్పులు రావన్నారు. ఎన్నికలు వాయిదా పడ్డాయని వైకాపా అభ్యర్థులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్ని నాని భరోసా ఇచ్చారు.

 

Leave a Comment