‘నీకు కరోనా పాజిటివ్ వచ్చింది.. ఉండూ పకోడీలు వేసి వస్తా’..!

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ భయాందోళనకు గురిచేస్తోంది. కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అయినా ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్నారు. గతేడాది ఫస్ట్ వేవ్ సందర్భంగా పాజిటివ్ వచ్చిందని తెలియగానే ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న వాళ్లే.. ఇప్పుడు సెకండ్ వేవ్ లో నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. 

తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాటిలీ పరిధిలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం.. పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ పాత జాతీయ రహదారిలో ఉన్న ఓ పకోడి షాపు యజమాని ఇటీవల కరోనా టెస్టు చేయించుకున్నాడు. అతనికి పాటిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మెడికల్ సిబ్బంది అతనికి ఫోన్ చేసి చెప్పారు.

కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి పరీక్షలు చేయించాలని, కుటుంబం అంతా హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. దీంతో పకోడి షాపు యజమాని.. ‘పకోడి కోసం చేసిన పిండి రుబ్బు కొంచెం ఉందమ్మా.. దాంతో పకోడిలు వేశాక వేస్తాంలే’ అని సమాధానం చెప్పాడు. అతడి మాటలకు చిర్రెత్తుకొచ్చిన మెడికల్ సిబ్బంది అతనికి చివాట్లు పెట్టి వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.   

Leave a Comment