మగవారు పార్లేజీ బిస్కెట్లు తినకపోతే అంతే.. బిస్కెట్ల కోసం క్యూ కట్టిన జనాలు..!

బీహార్ లో ఓ వింత పుకారు షికారు చేసింది. దీంతో పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఏంటి వింతగా అనిపిస్తుందా.. అవునండీ.. వింత పుకార్లే.. ఇంతకు ఏంజరిగిందంటే.. ‘జితియా పండగ నాడు మగపిల్లలు పార్లేజీ బిస్కెట్లు తప్పక తినాలి. లేకపోతే వారికి భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు వస్తాయి’ అంటూ పుకారు మొదలైంది. అంతే అక్కడి ప్రజలు ఆ పుకార్లను ఎంత బలంగా నమ్మారంటే.. షాపుల వద్ద పార్లేజీ బిస్కెట్ల కోసం ఎగబడ్డారు.  

తొలుత ఈ పుకారు సీతామర్హి జిల్లాలో వ్యాపించింది. దీంతో సీతామర్హి ప్రాంతంలోని పలు దుకాణాల ముందు పార్లేజీ బిస్కెట్ల కోసం క్యూ కట్టారు. లైన్లలో నిలబడి మరీ పార్లేజీ బిస్కెట్లు కొనుగోలు చేశారు. దీంతో షాపుల వద్ద అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఈ పుకార్లు కాస్త బైర్గానియా, ధేంగ్, నాన్ పూర్, దుమ్రా, బజ్ పట్టి ప్రాంతాలకు వ్యాపించాయి. ఆ తర్వాత మరో నాలుగు జిల్లాలకు వ్యాపించింది. అక్కడ కూడా పార్లేజీ బిస్కెట్ల కోసం క్యూలైన్లు కనిపించాయి. అయితే ఈ పుకార్లు ఎవరు వ్యాప్తి చేశారు.. ఎలా పుట్టుకొచ్చాయి అనే దాని గురించి మాత్రం తెలియరాలేదు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. కానీ పార్లేజీ కంపెనీ అమ్మకాలు మాత్రం భారీగా పెరిగిగాయి. దీని అవకాశంగా తీసుకున్న కొందరు షాపు యజమానులు ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ను రూ.50కి అమ్మడం ప్రారంభించారు. 

Leave a Comment