ఆయనకు 69.. ఆమెకు 73.. త్వరలో పెళ్లి..!

70 ఏళ్ల వయస్సులో పెళ్లా.. కొందరికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు. అయితే వయస్సు శరీరానికే కాని మనస్సుకు కాదు.. అందుకే ఒంటరితనాన్ని భరించలేని వారు జీవిత చరమాంకంలో తోడు కావాలని భావించారు. ఒకరికొకరు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల నుంచి ఎటువంటి అభ్యంతరం లేకపోవడంతో ఆ వృద్ధులు పెళ్లి చేసుకోబోతున్నారు.  

మైసూరు నగరంలో నివాసం ఉంటున్న 73 ఏళ్ల రిటైర్డు ఉపాధ్యాయురాలు కొన్నేళ్ల క్రితం భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తుంది. ఈక్రమంలో ఒంటరి తనంతో ఉన్న ఆమెకు తోడు అసరమని కుటుంబ సభ్యులు భావించారు. కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లికి ఒప్పించారు. 73 ఏళ్ల వృద్ధురాలికి వరుడు కావలెను అంటూ ఓ ప్రకటన ఇచ్చారు. 

అంతే ఆ ప్రకటన చూసిన 69 ఏళ్ల విశ్రాంత ఇంజినీర్ ఆమెకు ఫోన్ చేశారు. ఇద్దరి మనసులు కలిశాయి. ఇరువైపుల కుటుంబ సభ్యులు పెళ్లికి ఆమోదం తెలిపారు. 69 ఏళ్ల వృద్ధుడికి కూడా ఏడేళ్ల క్రితం భార్య చనిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు విదేశాలలో ఉన్నాడు. అతని ప్రోద్బలంతోనే పెళ్లికి అంగీకరించాడు. ఇక వీళ్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. 

Leave a Comment