భయం కాదు..ధైర్యం నింపండి : సీఎం జగన్

అమరావతి: వ్యాధి నివారణ చర్యలు చేపడుతున్న వారు ప్రజల్లో ధైర్యం నింపాలని సీఎం జగన్ సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం జగన్ కరోనా నివారణకు ఇప్పటివరకూ తీసుకున్న చర్యలపై ఆరాతీశారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన ప్రణాళికపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో  గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ,వార్డు వాలంటీర్ల రూపంలో మంచి వ్యవస్థ ఉందని, వారి ద్వారా ఇంటింటి సర్వే చేయించారా అని అధికారులను ప్రశ్నించారు. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లతో మ్యాపింగ్‌ చేయించాలన్నారు. సచివాలయాల్లోని హెల్త్‌ అసిస్టెంట్లు సహా, ఏఎన్‌ఎం, ఆశావర్కర్, వాలంటీర్లకు తప్పనిసరిగా యాప్‌ అందుబాటులో ఉంచాలన్నారు. మహిళా పోలీసులు, గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఇతర ఉద్యోగులకూ యాప్‌ అందుబాటులో ఉంచాలని తెలిపారు. 

యాభై ఇళ్లకు సంబంధించి డేటా సహా ఎప్పటికప్పుడు పరిస్థితులపై వివరాలను యాప్‌ ద్వారా తెప్పించుకోవాలన్నారు. డేటా వచ్చాక.. సంబంధిత వైద్య సిబ్బంది అలర్ట్‌ కావాలన్నారు. ఏం చేయాలి ? ఏం చేయకూడదన్న దానిపై వారికి సూచనలు ఇవ్వాలన్నారు.

 విదేశాల నుంచి వచ్చిన వారిపైన, వారి కుటుంబాల పైన సర్వే చేయించామని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ బాగా ఉపయోగపడుతోందన్నారు. ఇప్పటి వరకూ రెండు పాజిటివ్‌ కేసులు ఉన్నాయన్న అధికారులు తెలిపారు.  ఫిలిప్ఫైన్స్‌ నుంచి 185 మంది విద్యార్థులు వచ్చారని, వీరందరికీ పరీక్షలు నిర్వహించామని, కుటుంబ సభ్యులను కూడా రిసీవ్‌ చేసుకునేందుకు అనుమతించలేదని అధికారులు తెలిపారు.

 

Leave a Comment