బీహార్ లో కొత్త స్కామ్ -14 నెలల్లో 8 మంది అమ్మాయిలకు జన్మనిచ్చిన 65 ఏళ్ల మహిళ..!

సామాన్యంలో ఒక మహిళకు డెలివరీ కావాలంటే 9 నెలల సమయం పడుతుంది. కాని 65 ఏళ్ల ఒక మహిళ 14 నెలల్లో ఏకంగా 8 మంది అమ్మాయిలకు జన్మనించింది. ఇది జరిగింది బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాలో..ఇది వైద్యశాస్త్రంలోనే అసాధ్యమైన విషయం..కాని నేషనల్ హెల్త్ మిషన్ రికార్డుల్లో ఇది నిజమైంది. ముజఫర్ పూర్ జిల్లాలోని ముసాహరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ పథకంలో జరిగిన స్కామ్ ఇది .. ఈ ఆరోగ్య కేంద్రం ఇన్ ఛార్జ్ ఉపేంద్ర చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 

ఏం జరిగిదంటే..బీహార్ లో ఆడపిల్లల హత్యలను నిరోధించడానికి ప్రభుత్వం ఒక పథకం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ప్రసవం అయిన మహిళలకు రూ.1400 ప్రోత్సాహకం అందిస్తుంది. దీనిని అదునుగా భావించిన ఆ ఆరోగ్య సెంటర్ ఉద్యోగులు కొంత మంది మహిళల పేర్ల మీద ప్రభుత్వ ప్రోత్సాహకాలను తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. దీని కోసం ఆ మహిళల పేర్లు, చిరునామా మరియు ఖాతా నంబర్లు ఉపయోగించుకున్నారు. 

రికార్డుల్లో ఏముందంటే.. 65 ఏళ్ల లీలా దేవి అనే మహిళ 14 నెలల్లో ఎనిమిది మంది అమ్మాయిలను జన్మనిచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఆమె ప్రతి డెలివరీకి ప్రభుత్వం నుంచి రూ.1400ల ప్రోత్సాహకం లభించింది. అంతే కాక జాతీయ గ్రామాణ ఆరోగ్య మిషన్ రికార్డుల ప్రకారం శాంతి దేవి తొమ్మిది నెలల్లో ఐదుగురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. సోనియా దేవి ఐదు నెలల్లో నలుగురు అమ్మాయిలకు జన్మనిచ్చింది. ఈ విషయంపై ఆ మహిళలు భయభ్రాంతులకు గురయ్యారు.  తాము బిడ్డలకు జన్మనిచ్చి దాశాబ్దాలు అయ్యాయని చెప్పారు. ఈ కుంభకోణంపై జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. 

 

Leave a Comment