సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడికి యత్నించిన ఎమ్మెల్యే అనుచరులు.. వీడియో వైరల్.. !

ఆర్టీసీ బస్సు తమ వాహనానికి సైడ్ ఇవ్వలేదని ఓ ఎమ్మెల్యే అనుచరులు హల్ చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో బూర్గుల గ్రామ శివారులో ఆదివారం జరిగింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల మేరకు వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి షాద్ నగర్ మీదుగా వనపర్తికి వెళ్తోంది.. 

అదే సమయంలో వెనుక నుంచి ఓ కారు బస్సును ఓవర్ టేక్ చేసింది. బెంగళూరు హైవేపై మధ్యలో బస్సు అడ్డంగా కారు ఆపారు. కారులో నుంచి కొందరు వ్యక్తులు దిగి ఎమ్మెల్యే వాహనానికే సైడ్ ఇవ్వవా అంటూ రచ్చ చేశారు. కర్రతో డ్రైవర్ పై దాడికి ప్రయత్నించారు. డ్రైవర్ పై బూతు మాటలతో విరుచుకుపడ్డారు. దీంతో రోడ్డుపై కొద్ది సేపు ట్రాఫిక్ ఆగిపోయింది. 

తాము ఎమ్మెల్యే అనుచరులమని హైవేపై హల్ చేస్తున్న దానిని కొందరు వీడియో తీశారు. ఆ ఘటనను మరో బస్సులో వెళ్తున్న ప్రయాణికుడు చిత్రీకరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి ప్రయత్నించిన ఎమ్మెల్యే అనుచరులపై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.   

Leave a Comment