‘ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మగారూ’.. ఆర్జీవీకి మంత్రి పేర్ని కౌంటర్..!

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్లు, థియేటర్ల విషయంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆర్జీవీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.. తన ప్రశ్నలకు స్పందించాలని ఆర్జీవీ సవాలు విసిరారు.. ఈ వ్యవహారంపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు.. ఆర్జీవీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వరుస ట్వీట్లు చేశారు.. 

మంత్రి పేర్ని చేసిన వరుస ట్వీట్లు:

  • ‘ఆర్జీవీ గారూ రూ.100 టికెట్ ని రూ.1000కి, రూ.2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయి? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ అండ్ సప్లయి అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా? సామాన్యుడి మోజుని, అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్లుగా చట్టాలకు లోబడే సినిమా టెకెట్ ధరను నిర్ణయిస్తున్నాయి.’
  • ‘ఉప్పూ పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరలను మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చుగానీ, సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు.. థియేటర్లు అనేవి ప్రజాకోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు. బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్ పోతుందన్నది ఎకనామిక్స్ లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికీ వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ వినియోగదారుల యాంగిల్ ని గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ.’
  • ‘సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే.. మెడికల్, ఎడ్యుకేషన్ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించడం లేదు. థియేటర్ లో సినిమా టికెట్ల ధరలను ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెబుతున్నాయి.’
  • ‘హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్ కు ఒక ఫార్మాలా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించదు.’
  • ‘ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారు.. సినిమా ఒక వస్తువు కాదు. అది వినోద సేవ మాత్రమే.. ప్రజలను దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్ ధరల నియంత్రణ మాత్రమే తప్ప.. సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికి కాదు.’
  • ‘మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని, మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు.. సినిమా టికెట్ ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్లు. సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించడం సబబేనా వర్మగారూ.’ అంటూ పేర్ని నాని ట్వీట్లు చేశారు. 

 

Leave a Comment