ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్ లు పనిచేసేలా చూడండి

కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోను ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్ లు పనిచేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లకు స్పష్టం చేశారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ఆదివారం ఢిల్లీ నుంచి  ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా కేబినెట్ కార్యదర్శి మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, ఆ ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. రైల్వే ట్రాక్ లు జాతీయ ఇతర ప్రధాన రహదారులపై వలసకార్మికులు వారి స్వస్థలాలకు నడిచి వెళ్ళకుండా నివారించాలన్నారు. 

కరోనా నేపధ్యంలో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి వారి రాష్ట్రాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్న రైళ్ళు ఏరాష్ట్రానికి ఎప్పుడు బయలు దేరుతుందనే సమాచారంపై ముందుగానే వారికి పూర్తి అవగాహన కల్పించాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లను ఆదేశించారు.

అలాగే విదేశాలలో చిక్కుకున్న వారిని విమానాలు, ఓడలు ద్వారా తీసుకువచ్చే ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలిపారు.ఆ విధంగా వచ్చే వారిని ఆయా రాష్ట్రాల్లో 14 రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాలలో ఉంచాలని చెప్పారు.

గ్రీన్,ఆరెంజ్ జోన్లలో లాక్ డౌన్ మినహాయింపులు ద్వారా పరిశ్రమలు పునః ప్రారంభం అవుతున్నందున ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు పారిశ్రామిక భద్రతా చర్యలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజీవ్ గౌబ అందరు సిఎస్ లకు స్పష్టం చేశారు. 

ఈనెల 17 వరకూ లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడం ద్వారా వైరస్ వ్యాప్తి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ చెప్పారు.

 

Leave a Comment