లాక్ డౌన్ : జోన్ల వారీగా హైదరాబాద్ విభజన

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారిలో జిహెచ్ఎంసి పరిధిలోని వారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నందున హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్ ను ఒక్కో యూనిట్ గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్ల ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

 దేశంలో, రాష్ట్రంలో, సరిహద్దు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యశాఖ అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉండాలని కోరారు. సోమవారం కొత్తగా 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఒకరు మరణించారని అధికారులు సిఎంకు వెల్లడించారు. 

పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అన్ని లాబరేటరీలను, ఆసుపత్రులను సిద్ధం చేశామని చెప్పారు. ఒక్క రోజు వెయ్యి నుంచి 11 వందల మందికి పరీక్షలు నిర్వహించే విధంగా, ఎన్ని కేసులొచ్చినా వైద్యం అందించే విధంగా వ్యవస్థను సిద్ధం చేసినట్లు వివరించారు. 

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు, ఇతర జిల్లాల్లో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలను, లాక్ డౌన్ అమలును, ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాలను సిఎం సమీక్షించారు. కొందరు జిల్లా అధికారులతో నేరుగా మాట్లాడి పలు సూచనలు చేశారు. 

హైదరాబాద్ విషయంలో ప్రత్యేక వ్యూహం..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని కేసీఆర్ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారి ద్వారా ఇతరులకు తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా హైదరాబాద్ లో ఎక్కువ ఉన్నాయన్నారు. కాబట్టి హైదరాబాద్ విషయంలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలన్నారు. నగరంలోని మొత్తం 17 సర్కిళ్లను 17 యూనిట్లుగా విభజించాలన్నారు. 

 ప్రతీ యూనిట్ కు ప్రత్యేకంగా వైద్యాధికారిని, పోలీసు అధికారిని, మున్సిపల్ అధికారిని, రెవెన్యూ అధికారిని నియమించాలన్నారు. మున్సిపల్ యంత్రాంగమంతా కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో నిమగ్నం కావాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతా ఒకో డిఎం అండ్ హెచ్ఓ ఉన్నారని, 17 సర్కిళ్లకు వేర్వేరుగా సీనియర్ వైద్యాధికారిని నియమించాలని ముఖ్యమంత్రి చెప్పారు. 

ప్రజలను బయటకు రానియొద్దు..

‘‘పాజిటివ్ కేసుల ఆధారంగా రాష్ట్రం మొత్తం 246 కంటైన్మెంటులు ఏర్పాటు చేశాం. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 126 కంటైన్మెంటులున్నాయి. వీటిని మరింత పకడ్బందీగా నిర్వహించాలి. ఈ కంటైన్మెంట్లలోని ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయవద్దు. బయట వారిని లోపటికి పోనీయవద్దు. ప్రతీ కంటైన్మెంటుకు ప్రత్యేక పోలీసు అధికారిని, నోడల్ అధికారిని నియమించాలి. వారి ఆధ్వర్యలో అత్యంత కఠినంగా నియంత్రణ చేయాలి. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగమే అందించాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

 

Leave a Comment