విద్యాసంస్థలు, మతపరమైన సమావేశాలపై నిషేధం పొడిగింపు

అన్ని విద్యాసంస్థలు, మతపరమైన సమావేశాలకు నిషేధాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మార్చి 24న ప్రధాని నరేంద్రమోడీ మూడు వారాల పాటు విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుంది. అయితే కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడిగించాలని కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి సూచిస్తున్నాయి. 

బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్, తెలంగాణాతో సహా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా మరింత పెరిగే అవకాశం ఉందని, లాక్ డౌన్ పొడిగిస్తే కరోనాను కట్టడి చేయగలమని పేర్కొన్నాయి. అయితే లాక్ డౌన్ పొడిగింపును పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

అయితే మంగళవారం జరిగిన మంత్రుల సమావేశంలో దేశంలోని అన్ని విద్యాసంస్థలు, మతపరమైన సమావేశాలపై నిషేధాన్ని పొడిగించాలని మంత్రులు సిఫార్సు చేసినట్లు తెలిసింది. మతపరమైన కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే అవకాశాలు ఉన్నాయని, దీనిపై నిశితంగా పరిశీలించాలని మంత్రులు సూచించారు. 

ఈ సమావేశంలో మతపరమైన సమావేశాలు, విద్యాసంస్థలు మరియు షాపింగ్ మాల్స్ ను ప్రారంభించడానికి అనుమతించవద్దని నిర్ణయించారు. ఒక వేళ లాక్ డౌన్ ఏప్రిల్ 14న ముగిస్తే వీటిపై నిషేధం ఇంకా నాలుగు వారాలా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 

అయితే తెలంగాణా ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్ ను జూన్ 3 వరకు పొడిగించాలని సూచించింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య జూన్ 1 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటాయని పేర్కొంది. దీంతో లాక్ డౌన్ ను ఇంకా పొడిగించాలని కోరింది. 

గత 24 గంటల్లో దేశంలో 508 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దేేశంలో మొత్తం 4,789 కేసులు నమోదు కాగా, 124 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణంకాలు చూపించాయి. 

 

Leave a Comment