ఇక చాలు..ఆపుదాం : పవన్ కల్యాణ్

కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెడదామని,  చిల్లర రాజకీయాలకు దూరంగా ఉందామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి ఏపీని సైతం విడిచిపెట్టలేదన్నారు. ఏపీలో కరోనా నివారణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనా కొందరు అధికార పార్టీ పెద్దలు దృష్టి పెడుతున్నారని విమర్శించారు. 

గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రజలు పెరుగుతున్న పాజిటివ్  కేసులు చూసి బెంబేలెత్తిపోతున్నారన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో తప్పులు వేలెత్తి చూపే వారిపై బురద చల్లే కార్యక్రమాన్ని అధికార పార్టీ పెద్దలు కొనసాగిస్తున్నారని తెలిపారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయని చెప్పారు. 

ఆయనపై జరుగుతున్న  వ్యక్తిత్వహనన దాడి ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన రీతిలో, ఆయనకు క్షమాపణలు చెప్పాలని అడిగే స్థాయిలో ఉందని తెలిపారు. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై  మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దామని పిలుపు నిచ్చారు. ఇప్పటివరకు అయినది చాలని, ఈ సమయంలోనైనా  రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడే ప్రమాదముందని హితవు పలికారు. 

Leave a Comment