అమ్మాయిలు జీన్స్ వేసుకోవద్దని పంచాయతీ తీర్మానం.. వేస్తే సంఘ బహిష్కరణ..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ కు చెందిన క్షత్రియ పంచాయతీ అమ్మాయిలు, అబ్బాయిల డ్రెస్ విషయంలో సరికొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అమ్మాయిలు జీన్స్ ధరించవద్దని పంచాయతీ తీర్మానించింది. కాదని ఎవరైనా ధరిస్తే వారిని సంఘ బహిష్కరణ చేస్తామని హెచ్చరించింది. 

అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా నిక్కర్లు వేసుకోవద్దని తీర్మానం చేసింది. తీర్మానాన్ని ఉల్లంఘించిన వారికి జరిమాన విధిస్తామని క్షత్రియ పంచాయతీ స్పష్టం చేసింది. అమ్మాయిలు జీన్స్ ధరించడం వల్ల వేధింపులు ఎక్కువతున్నాయని పంచాయతీ అభిప్రాయపడింది. వేధింపులు జరగకుండా ఉండాలంటే అమ్మాయిలు జీన్స్ ధరించకుండా చూస్తే బాగుంటుందని కొందరు చేసిన సూచనల మేరకు మంగళవారం క్షత్రియ పంచాయతీ సమావేశమై దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంది.

క్షత్రియ కులం గౌరవ మర్యాదలను కాపాడేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు పంచాయతీ పెద్దలు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా దుస్తులు ధరించాలని, ప్రస్తుతం పంచాయతీ చేసిన తీర్మానానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలకు వ్యతిరేకండా దుస్తులు ధరించి ఎక్కువ సార్లు పట్టుబడితే సంఘ బహిష్కరణ చేసేందుకు వెనుకాడమని వెల్లడించారు.   

Leave a Comment