అప్పుల బాధతో ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ దంపతుల ఆత్మహత్య.. సెల్పీ వీడియో వైరల్..!

అప్పులు తీర్చలేక ఓ ప్రైవేటు స్కూల్ కరస్పాండెంట్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారుల ఒత్తిడితోనే చనిపోతున్నట్లు సుబ్రమణ్యం(34), రోహిణి(28) దంపతులు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో చోటుచేసుకుంది. 

జిల్లాలోని కోవెలకుంట్ల పట్టణానికి చెందిన రాధాకృష్ణమూర్తి స్థానిక వాసవీ బొమ్మిడాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసి 8 ఏళ్ల క్రితం రిటైర్డ్ అయ్యారు. ఆయన కుమారుడు సుబ్రమణ్యం ఇదే కళాశాలలో కొంతకాలం కాంట్రాక్ట్ బేసిక్ పై కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేశాడు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టణంలో 2017 నుంచి లైఫ్ ఎనర్జీ స్కూల్ పేరిట సొంతంగా ప్రైవేట్ పాఠశాల నడుపుతున్నాడు. 

ఈక్రమంలో ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.2.50 కోట్ల అప్పులు చేశాడు. కరోనాతో ఏడాదిన్నర కాలంగా పాఠశాల సక్రమంగా నడవలేదు. దీంతో అప్పులు చెల్లించలేకపోయాడు. అప్పుదారులు ఒత్తిడి తీసుకురావడంతో మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి భార్య స్వగ్రామమైన ఆత్మకూరుకు బయలుదేరారు. 

మార్గమధ్యంలో ఆత్మకూరు దగ్గర లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. అప్పుదారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకుటునట్లు సెల్పీ వీడియో తీసుకున్నారు. ‘అందరికి వెరీ వెరీ సారీ.. మేము చనిపోతున్నాము.. మాకు సపోర్ట్ లేక చనిపోతున్నాము. కిషోర్ రియల్లీ సారీ. సారీ అత్తమ్మ.. సారీ మామయ్య.. ఐషు జాగ్రత్త.. అందరూ జాగ్రత్త.. మాలాగా ఎవరూ ఇబ్బంది పడవద్దండి’ అంటూ ఏడుస్తూ సెల్పీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియోను వాట్సాప్ స్టేటస్ పెట్టి మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. 

అపస్మారక స్థితిలో ఉన్న వారిని అటుగా వెళ్తున్న వ్యక్తులు గమనించి ఆత్మకూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సుబ్రమణ్యం మృతి చెందాడు. రోహిణికి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా చనిపోయింది.

 

Leave a Comment