సన్నాఫ్‌కు స్వస్తి..!

ఆధార్‌లో బంధుత్వాలకు చెల్లు

సన్నాఫ్‌, డాటరాఫ్‌ స్థానంలో కేరాఫ్‌..

గుట్టు చప్పుడు కాకుండా నిర్ణయం.

అమరావతి : ఆధార్‌ కార్డులో బంధుత్వాలకు మంగళం పాడుతున్నారు. తద్వారా, భవిష్యత్తులో మా తండ్రో, భర్తో భారతీయుడు కనక నేను కూడా ఇండియన్‌నే అనడానికి అవకాశం ఉండకపోవచ్చునని, ఎన్నార్సీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరికి వారే తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఆధార్‌లో మాత్రమే కాదు.. పాస్‌పోర్టులోనూ ఇదే మార్పు రానుంది. నిజానికి, పౌరసత్వం పొందాలంటే మన దేశంతోపాటు విదేశాల్లోనూ ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్‌లను ప్రామాణికంగా భావిస్తారు. ఈ రెండు డాక్యుమెంట్ల ఆధారంగానే భారత పౌరుడు అని ధ్రువీకరిస్తారు. ఇప్పటి వరకూ వీటిలో తండ్రి/భర్త పేర్లు, వారితో బంధుత్వాల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇప్పుడు వీటికి స్వస్తి పలకాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా కేరాఫ్ ను తెరపైకి తెచ్చింది. పాస్‌పోర్టుల్లోనూ ఇలాంటి మార్పులే చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించిందని, ఈ విధానం త్వరలో అమలు కానుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

గుట్టుచప్పుడు కాకుండా నిర్ణయం..

సాధారణంగా ఇప్పటి వరకూ ఉన్న విధానం ప్రకారం.. ఆధార్‌ కార్డు కావాలని మీరు దరఖాస్తు చేస్తే.. దరఖాస్తుతోపాటు తండ్రి లేదా భర్త బంధుత్వానికి సంబంధించిన వివరాలు కూడా అడుగుతారు. వాటి ఆధారంగా ఆధార్‌లో బంధుత్వాలను నమోదు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కార్డు కోసం దరఖాస్తు చేస్తే.. గతంలో మాదిరిగా అన్ని ధ్రువీకరణ పత్రాలూ సమర్పించడం తప్పనిసరే! కానీ, కొత్తగా జారీ అయ్యే కార్డులో బంధుత్వం వివరాలు మాత్రం ప్రచురించడం లేదు. ఇప్పటి వరకు ఉన్న సన్నాఫ్‌, డాటరాఫ్‌ స్థానంలో కేరాఫ్‌ అని నమోదు చేస్తున్నారు. కొత్త కార్డుదారులకు మాత్రమే కాదు.. మార్పులు చేర్పులకు సంప్రదిస్తున్న వారి పాత డేటాలోనూ బంధాలు తొలగిస్తున్నారు. ఇప్పటికే, దేశంలో సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీలపై తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పౌరసత్వాన్ని నిరూపించుకునే అధికారిక పత్రాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలోనే, కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా ఆధార్‌లో బంధాలను తొలగించడం చర్చనీయాంశమవుతోంది. ఆధార్‌లో బంధుత్వాల తొలగింపు; కేరాఫ్‌ కొత్తగా చేర్చడానికి సంబంధించి కేంద్రం లేదా ఆధార్‌ సంస్థ నుంచి ఎటువంటి అధికారిక ఉత్తర్వులూ రాలేదు. ఈ నిర్ణయం వెనక ఉద్దేశం ఏమిటో కూడా తెలియదు. ఈ మార్పులు ఇటీవలి కాలంలోనే చోటుచేసుకోవడంతో.. సీఏఏ, ఎన్నార్సీని అమలు చేయాలని గట్టి పట్టుదలతో ఉన్న కేంద్రం.. అందులో భాగంగానే తాజా మార్పులను తెరపైకి తెచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంక్షేమ పథకాలకు ఇబ్బందే!

సాధారణంగా నిర్దిష్టమైన చిరునామా లేని సందర్భాల్లో, మరొకరి చిరునామా వినియోగిస్తున్నప్పుడు, ఇతరుల పేరిట చిరునామా ఇచ్చినప్పుడు మాత్రమే ‘కేరాఫ్‌’ పదాన్ని వినియోగిస్తారు. సాధారణంగా ‘కేరాఫ్‌’ అనేది తాత్కాలికమే కానీ, శాశ్వత చిరునామా గా ఉండదు. దానికి ప్రామాణికత కూడా పరిమితమే. దీనికితోడు, మనదేశంలో బంధుత్వాలకు, సంక్షేమ పథకాలకు అవినాభావ సంబంధం ఉంది. వితంతు పింఛను రావాలంటే భర్త వివరాలు ఇవ్వడం తప్పనిసరి. విద్యాసంస్థల్లో ప్రవేశానికి, రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్లు తదితరాలకు తండ్రి వివరాలు పేర్కొనాల్సిందే. ఇందుకు సంబంధించి ఆధారం కూడా చూపించాల్సి ఉంటుంది. వ్యక్తిగత వివరాలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటరు కార్డు, పాన్‌ కార్డు వంటివి సమర్పిస్తున్నారు. కానీ, వాటిలో బంధుత్వ ధ్రువీకరణ ఉండదు. బంధుత్వాన్ని ఇంతవరకు ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు మాత్రమే ధ్రువీకరిస్తున్నాయి. 

త్వరలో పాస్‌పోర్టులోనూ..

ఆధార్‌ తర్వాత బంధుత్వాలను రుజువు చేసే మరో కీలక డాక్యుమెంట్‌ పాస్‌పోర్టు. ఇందులో పౌరుడి పేరుతోపాటు తండ్రి, తల్లి, భర్త లేదా భార్య పేరు కూడా ప్రచురిస్తున్నారు. ఇకపై వీటిని ఇలాగే కొనసాగిస్తారు. కానీ, బంధుత్వం తెలిపే సన్నాఫ్‌, డాటరాఫ్‌, వైఫ్‌ ఆఫ్‌ స్థానంలో ‘కేరాఫ్‌’ ప్రవేశపెట్టాలని విదేశాంగ శాఖ ఇప్పటికే నిర్ణయించిందని పాస్‌పోర్ట్‌ కార్యాలయంలోని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ‘కేరాఫ్‌’ నమోదు తో భారత పౌరులకు విదేశాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయన్న విషయంపై విదేశాంగ శాఖ అధ్యయనం చేస్తోందని, సంబంధిత నివేదిక అందిన వెంటనే మార్పులు చేయవచ్చని తెలుస్తోంది.

నష్టం ఏమిటీ ? 

మీ తండ్రికి, మీకు ఆస్తి వివాదం ఉంది. దానికి సంబంధించి కోర్టులో కేసు వేశారు. ఆయన మీ తండ్రి అని చెప్పడానికి ఆధారం చూపించాలి. మీ దగ్గర బర్త్‌ సర్టిఫికెట్‌ ఉంటే సరేసరి. లేకపోతే ఆధారే ఆధారం. ఇప్పుడు ఆధార్‌లో కేరాఫ్‌ అని మార్చేశారనుకోండి. మీకున్న ఆధారం మూసుకుపోయినట్లే! ఒక్క ఆస్తి వివాదం మాత్రమే కాదు.. నిత్య జీవితంలో ఇటువంటి ఎన్నో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా, వీసాలు, పాస్‌పోర్టులు, పౌరసత్వం తదితరాలకు ఇవి మరింత కీలకం. పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్న దానిపై కేంద్రం కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో దీనిని ఎప్పుడు అమలు చేసినా పౌరులు వ్యక్తిగతంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు కూడా సమర్పించడం తప్పనిసరి కావచ్చు. అప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయి.

Leave a Comment