ఆ ఎమ్మార్వోకి వందల కోట్ల ఆస్తులు..ఏసీబీ చరిత్రలోనే రికార్డు లంచం..!

రెవెన్యూ శాఖలో అవినీతి అంటే హా…మాములేగా..అంటూ జనం తెలిగ్గా కొట్టి పారేస్తారు.  ఇప్పటి వరకు వేలల్లో, లక్షల్లో అవినీతికి పాల్పడిన అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కానీ ఏసీబీ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తం లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు కీసర తహసీల్దార్ నాగరాజు..గత రెండు రోజులుగా తహసీల్దార్ కార్యాలయం, నాగరాజు ఇల్లు, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో నాగరాజు ఆస్తులను చూసి ఏసీబీ అధికారులు షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు వందల కోట్ల భూమి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజుతో పాటు మరో ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. 

మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని రాంపల్లి దాయర అనే గ్రామంలో 44 ఎకరాల భూమి తగాదాలో ఉంది. 1996లో 16 ఎకరాలను ఒక కుటుంబానికి ఇస్తూ అప్పట్లో ఆర్డీవో ఉత్తర్వులు ఇచ్చారు. మిగిలిన 28 ఎకరాలకు సంబంధించి ఓ వర్గానికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులో పేర్ల నమోదుతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్ నాగరాజు రియల్ బ్రోక్ కందాడి అంజిరెడ్డి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

అల్వాల్ లోని తహసీల్దార్ నాగరాజు ఇల్లు, అతడి బంధువుల ఇళ్లు, కీసర తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించగా..రూ.36 లక్షల నగదు, అరకిలో బంగారు ఆభరణాలు, లాకర్ కీ, పలు భూపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తువల విలువ వందల కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.    

 

Leave a Comment