22న జనతా కర్ఫ్యూ ..!

దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు…

ఈనెల 22న ఆదివారం జనతా కర్ఫ్యూ (ప్రజలు ఎవరూ బయటకు రాకుండా) చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రభావంతో దేశ ప్రజలు ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు సంకల్పం, నిబద్ధతతో మెలగాలని పిలుపునిచ్చారు. ‘మన సంకల్పం దృఢంగా ఉండాలి. కరోనాను నివారించడానికి కేంద్రం, రాష్ట్రాలు కృషి చేస్తున్నాయి. మనం స్వచ్ఛంగా ఉందాం. సమాజాన్ని స్వచ్ఛంగా ఉంచుదాం. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దు. గుమిగూడొద్దు. ఈ రెండూ కరోనా నివారణకు కీలకం.’ అని ప్రధాని మోదీ అన్నారు. మనకేం కావొద్దని ప్రజలు ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని ప్రధాని మోదీ హెచ్చరించారు. రాబోయే రోజులు మరింత ముఖ్యమని, ఎంతవరకు వీలైతే అంత వరకు వ్యాపారం, ఉద్యోగాలు ఇంటి వద్ద నుంచే చేసుకోవాలని పిలుపునిచ్చారు. 60 సంవత్సరాలు దాటిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కరోనా వైరస్ మీద పోరాటంలో కృషి చేస్తున్న వారికి మార్చి 22వ తేదీన సాయంత్రం 5 గంటలకు 5 నిమిషాల పాటు ప్రజలు తమ ఇంటి గేటు వద్ద నిలబడి సైరన్ మోగించి కృతజ్ఞతలు చెప్పాలని సూచించారు. ప్రజలు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే డాక్టర్‌కు ఫోన్ చేసి మెడిసిన్ తీసుకోవాలని సూచించారు. అంతే కానీ, బయటకు రావొద్దని పిలుపునిచ్చారు. తమ వద్ద పనిచేసే వారి గురించి సంబంధిత యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కొన్ని రోజుల పాటు వారి ఆర్థిక అవసరాలను గుర్తించి సాయం చేయాలని సూచించారు. జీతం కట్ చేయకుండా ఇచ్చేందుకు ప్రయత్నించాలన్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారు. దీన్ని కట్టడి చేయడానికి కేంద్ర ఆర్థిక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను సరైన దిశలో నడిపేందుకు ఈ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుందని చెప్పారు.

 

Leave a Comment