రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై వేటు !

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై జగన్ సర్కార్ వేటుకు సిద్ధమైంది. ఏపీలో ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన రూల్స్ మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దానిని గవర్నర్ ను పంపగా ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. తాజా ఆర్డినెన్స్ తో ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ ను తొలగిస్తూ జగన్ సర్కార్ జీవో జారీ చేసింది.

 స్థానిక ఎన్నికల్లో వైసీపీ అవకతవకలపై రమేష్ కుమార్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని కేంద్రానికి లేఖ రాశారు. తన వ్యక్తిగత భద్రతకు భరోసా లేదని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. 

అయతే రమేష్ కుమార్ ముక్కు సూటితనంపై సీఎం జగన్ ఇటీవల భగ్గుమన్నారు. ఆయనపై వైసీపీ నేతలు విమర్శలకు దిగారు. అయితే కరో సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సరికాదని నిర్ణయాత్మకంగా వ్యవహరించిన రమేష్ కుమార్ పై ఇప్పుడు వేటు వేయడంతో రాజకీయ వర్గాల్లో కలకలం నెలకొంది. అయితే నిష్పాక్షికంగా వ్యవహరించే అధికారులను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. 

ఎస్ఈసీ రమేష్ కుమార్ పై వేటు చట్ట ప్రకారంగా చెల్లుబాటు కాదు : దేవినేని ఉమ

 సీఎం జగన్ దుర్మార్గంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. కరోనా బారిన పడకుండా 5 కోట్ల ప్రజలను రమేష్ కుమార్ కాపాడారన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ లు కోర్టులో నిలబడవని చెప్పారు. మాస్క్ లు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు. 

జగన్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది : ఆర్ కే

 మాస్క్ లు లేవన్నందుకు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారని సీపీఐ నేత  రామకృష్ణ విమర్శించారు. కరోనా విజృంభిస్తుంటే ఎన్నికలు ఆపించి రమేష్ మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. తన మాట విననందుకు రమేష్ కుమార్ పై జగన్ కక్ష గట్టారన్నారు. ఆయనను తొలగించే అధికారం జగన్ ప్రభుత్వానికి లేదని, పార్లమెంట్ కు మాత్రమే ఆ అధికారం ఉందని చెప్పారు.

Leave a Comment