కరోనాను జయిస్తే బలమైన ఆర్థిక శక్తిగా భారత్ : కిషన్ రెడ్డి

కరోనాను జయిస్తే భవిష్యత్ లో భారత్ బలమైన ఆర్ధిక శక్తిగా ఎదిగే అవకాశం  ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా రెండో విడత లాక్ డౌన్ లో భారీగా సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన చెప్పారు. కేంద్ర హోంశాఖ కమాండ్ కంట్రోల్ రూమ్ కి విజ్ఞప్తులు పెరిగాయని,

ఎప్పటికప్పుడు రాష్ట్రాలు, ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల బత్తాయి రైతుల సమస్యలను కిషన్ రెడ్డి పరిష్కరించారు. ఢిల్లీలో ఆజాద్ పూర్ మండిలో 24 గంటలపాటు పండ్ల మార్కెటింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. రాష్ట్రాల సరిహద్దుల్లో కూరగాయలు, ఆహార పదార్థాలు ,పండ్ల ట్రక్కులు ఆపకుండా రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశించింది. 

సరుకు రవాణాలో ఇబ్బందులు  వస్తే సమస్య పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 14488 నెంబర్ కి ఫోన్ చేస్తే రైతులకు సహాయం అందిస్తామన్నారు. వ్యవసాయ శాఖ కంట్రోల్ రూమ్ నెంబర్ 18001804200 కిఫోన్ చేస్తే సహాయం అందిస్తామని తెలిపారు. 

దేశవ్యాప్తంగా వలస కార్మికుల సంక్షేమం కోసం 12 వేల కోట్ల నిధులు రాష్ట్రాలకు కేటాయించామన్నారు. రాష్ట్ర విపత్తు నిధులు కింద ఆహారం, వసతి, బట్టలు, మెడికల్ కేర్ కోసం నిధులు విడుదల చేశామన్నారు.  ఏపీకి రూ.559 కోట్లు, తెలంగాణకు రూ.224 కోట్లు విడుదల చేశామని తెలిపారు. 

రేషన్ కార్డులు లేని వలస కార్మికులను ఆదుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.  వైద్యులపై దాడులకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. 

ప్రపంచ దేశాల్లో కంటే భారత్ లో పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. భవిష్యత్తులో చైనా నుంచి అనేక పరిశ్రమలు భారత్ కి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో అతనికే అర్థం కావడం లేదన్నారు. రాహుల్ గాంధీ నిర్మాణాత్మక సూచనలు చేస్తే స్వీకరిస్తామన్నారు. కానీ లాక్ డౌన్ తో ఉపయోగం లేదని రాహుల్ వ్యాఖ్యలు అర్థ రహితమన్నారు. 

మద్యం అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించవద్దని సూచించారు. కేంద్రం మద్యం అమ్మకాలపై సడలింపు ఇవ్వదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు వారి పరిధిలో నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ప్రజలు లాక్ డౌన్ ని తప్పనిసరిగా పాటించాలని కోరారు. 

 

Leave a Comment