అన్నీ ఉన్నా.. నా జీవితంలో సంతోషం లేదు.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు..!

సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విలువైన ఆస్తులు, ప్రజల్లో పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ తన జీవితంలో సంతోషం అనేది లేకుండాపోయిందని వ్యాఖ్యానించారు. చెన్నైలో నిర్వహించిన ‘హ్యాపీ సక్సెస్ ఫుల్ లైఫ్ థ్రూ క్రియ యోగా’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తన జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. 

రజనీకాంత్ ఇప్పటి వరకు దాదాపు 170 సినిమాల్లో నటించినప్పటికీ కేవలం రెండు చిత్రాలు మాత్రమే ఆయనకు ఆత్మ సంతృప్తినిచ్చాయని అన్నారు.. ‘బాబా’, ‘రాఘవేంద్ర’ సినిమాలు మాత్రమే సంతృప్తిని అందించాయన్నారు.  అవి విడుదలైన తర్వాతే ఆ ఇద్దరు సద్గురువుల గురించి అందరికీ తెలిసిందన్నారు. 

ఈ రెండు సినిమాలు ప్రేక్షకులపై ఎంతో ప్రభావాన్ని చూపాయని, వీటిని చూసిన తర్వాత తన అభిమానుల్లో ఇద్దరు సన్యాసం స్వీకరించారని పేర్కొన్నారు. కానీ..తాను మాత్రం ఇంకా నటుడిగానే కొనసాగుతున్నానని అన్నారు. హిమాలయాల్లో కొన్ని అపూర్వమైన మూలికలు దొరుకుతాయని, అవి తింటే వారంరోజులకు సరిపడా శక్తి లభిస్తుందని తెలిపారు. 

మనిషికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమన్నారు. ఒకవేళ మనకు ఏదైన అనారోగ్యం వస్తే కావాల్సిన వాళ్లు కూడా తట్టుకోలేరన్నారు. తాను తన జీవితంలో డబ్బు, పేరు ప్రఖ్యాతలు అన్నీ చూశానని, అయితే సంతోషం, ప్రశాంతత మాత్రం పది శాతం కూడా దక్కలేదని, ఎందుకంటే అవి శాశ్వతంగా ఉండేవి కావని అని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.   

 

 

Leave a Comment