సెలవు కోసం ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు..!

ఓ వ్యక్తి ఎక్కువ పెయిడ్ సెలవుల కోసం ఒకే అమ్మాయిని ఏకంగా నాలుగు సార్లు వివాహం చేసుకున్నాడు. చివరికి ఆ వ్యక్తి పనిచేసే బ్యాంక్ అతని నిర్వాకం తెలుసుకుని సెలవు పొడిగింపును నిరాకరించింది. తైవాన్ రాజధాని తాయ్ పెయ్ నగరంలో ఓ బ్యాంక్ లో క్లర్క్ గా పనిచేస్తున్న వ్యక్తి సుమారు నెల రోజుల వ్యవధిలో ఒకే అమ్మాయిని 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. 

కేవలం తన బ్యాంక్ నుంచి సెలవు పొడిగింపు కోసమే అతనీ పని చేశాడు. తైవాన్ కార్మిక చట్టం ప్రకారం ఏ ఉద్యోగికైనా పెళ్లికి 8 రోజుల వేతనంతో కూడిన సెలవు తప్పనిసరిగా ఇవ్వాలి. దీన్ని తెయ్ పెయ్ నగరంలో బ్యాంకు క్లర్క్ గా పనిచేసే వ్యక్తి తనకు అనుకూలంగా వాడుకున్నాడు. పెళ్లి చేసుకునేందుకు 8 రోజుల సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 

ఈ సెలవులతో అతడు సంతృప్తి చెందలేదు. ఎక్కువ రోజులు సెలవు కావాలనుకున్నాడు. దీంతో అతను తన భార్యకు విడాకులు ఇచ్చి మళ్లీ పెళ్లి కోసం సెలవు దరఖాస్తు చేశాడు. అలా అతను తన భార్యకు 3 సార్లు విడాకులు ఇచ్చి మళ్లీ ఆమెనే 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. అందుకు గాను మొత్తం 32 రోజుల సెలవు కోసం దరఖాస్తు చేశాడు. 

అయితే అతడు పనిచేస్తున్న బ్యాంక్ వారు ఈ విషయాన్ని పసిగట్టి అతనకి సెలవును పొడిగించేందు నిరాకరించారు. దీంతో సదరు వ్యక్తి లేబర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అంతే కాదు సెలవులు ఇవ్వని బ్యాంకు అధికారులకు లేబర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరిమానా కూడా విధించింది.   

Leave a Comment