మాజీ సీఎం రోశయ్య కన్నుమూత..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య(88) కన్నుమూశారు. శనివారం ఉదయం బీజీ డౌన్ కావడంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ లోని స్టార్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా, తమిళనాడు గవర్నర్ గా పనిచేశారు. 

గుంటూరు జిల్లా వేమూరులో 1933 జూలై 4న రోశయ్య జన్మించారు. 1968లో ఆయన తొలిసారిగా శాసన మండలికి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1968,1974,1980 లలో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరి వద్ద పలు కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 

2004లో చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయకుండా శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైనారు. 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబర్ 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011-16 వరకు తమిళనాడు గవర్నర్ గా సేవలు అందించారు. కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగిన రోశయ్య, దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.    

Leave a Comment