నిత్యావసరాల ధరలపై నిఘా పెట్టండి : సీఎం జగన్

నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు.  కోవిడ్ -19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ నిత్యావసరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం రైతుభరోసా, మత్స్యకార భరోసాలపై సీఎం సమీక్ష చేశారు. లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో రెండు వారాల పాటు ప్రదర్శించాలని స్పష్టం చేశారు. తర్వాత గ్రీవెన్స్‌ కోసం కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలని ఆదేశించారు. 

గ్రీన్ క్లస్టర్లలో జాగ్రత్తలతో కార్యకలాపాలు..

కోవిడ్‌ –19 నివారణా జాగ్రత్తలతో గ్రీన్‌ క్లస్టర్లలో కార్యకలాపాలు నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు.ఇచ్చిన సడలింపుల మేరకు కార్యకలాపాలు ప్రారంభించిన రంగాల్లో కరోనా వైరస్‌ నివారణా చర్యలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. దీనివల్ల కార్యకలాపాలు సజావుగా సాగడానికి అవకాశాలు ఉంటాయన్నారు. 

రెడ్, ఆరెంజ్‌ క్లస్టర్లలో  నిర్దేశించుకున్న నిబంధనలను పాటించాలన్నారు. గ్రీన్‌ క్లస్టర్లలో మాత్రం సడలించిన నిబంధనల మేరకు కార్యకలాపాలు కొనసాగేలా చూడాలన్నారు. గ్రీన్‌ క్లస్టర్లలోని పరిశ్రమలు, అగ్రి ప్రాససింగ్‌ యూనిట్లు, వ్యవసాయ కార్యకలాపాల్లో భౌతిక దూరం పాటించి ఆ మేరకు ఆయా కార్యకలాపాలు ముందుకు సాగేలా చూడాలని సూచించారు. 

కోల్డ్‌స్టోరేజీలపై దృష్టిపెట్టాలి..

ఆక్వా ఉత్పత్తులను నిల్వచేయడానికి కోల్డ్‌స్టోరేజీలపై దృష్టిపెట్టాలని సీఎస్‌కు సీఎం ఆదేశించారు. ఫాంగేట్‌ వద్దే పంట కొనుగోలు పద్ధతిని సమర్థవంతగా అమలు చేయాలన్నారు. కూపన్‌ విధానం ఏరకంగా పని చేస్తుందో పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్లను వినియోగించుకోవాలన్నారు. ఆయిల్‌పాం ధర తగ్గుదలపై దృష్టి పెట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం రాకూడదన్నారు. 

గుజరాత్‌లో తెలుగు మత్స్యకారుల బాగోగులపై దృష్టి:

గుజరాత్‌లో తెలుగు మత్స్యకారుల అంశంపై సమావేశంలో చర్చించారు. వారికి తగిన సదుపాయాలు, ఆహారం అందించాల్సిందిగా గుజరాత్‌ సీఎంకు ఫోన్‌ చేశామని సీఎం తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారులకు కూడా వివరించామన్నారు. గుజరాత్‌లో ఉన్న తెలుగు మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అక్కడున్న సుమారు 6వేల మంది మత్స్యకారులకు ఈ డబ్బు అందజేయాలని సూచించారు. 

 

Leave a Comment