రైతులను అక్రమ కేసులతో వేధిస్తున్నారు : లోకేశ్‌

గుంటూరు: అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. మందడంలో డ్రోన్‌ కెమెరాతో పోలీసులు చిత్రీకరించారనే ఆందోళనలో అరెస్టయి గుంటూరు జైల్లో ఉన్న రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో లోకేశ్‌ మాట్లాడుతూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. రైతుల పక్షమని కాలర్‌ ఎగరేసే వైకాపా ప్రభుత్వం.. 2,500 మంది అమరావతి రైతులపై కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులను కించపరిచేలా మాట్లాడుతున్నారని.. మహిళలపై అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని లోకేశ్‌ ఆరోపించారు. మందడం ఘటనతో సంబంధం లేని వారిని సైతం పోలీసులు అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. 71 ఏళ్ల రైతుతో పాటు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మరో రైతును అరెస్ట్‌ చేయడాన్ని లోకేశ్‌ తప్పుబట్టారు. వారి ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు కాబట్టే విచారణకు డీజీపీని హైకోర్టు పిలిచిందని.. గుంటూరు జిల్లా ఎస్పీపై సీబీఐ విచారణకు ఆదేశించిందని గుర్తు చేశారు.

 

Leave a Comment