ఒమిక్రాన్ ను లైట్ తీసుకోవద్దు.. శ్వాస వ్యవస్థ పై భాగంపై ఎఫెక్ట్ : WHO

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది.. ప్రపంచదేశాలకు దఢ పుట్టిస్తోంది.. అయితే ఒమిక్రాన్ పై రోజురోజుకు రకరకాల వార్తలు వస్తున్నాయి. ఒమిక్రాన్ అసలు ప్రమాదకరం కాదని, డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఒమిక్రాన్ పై మరోసారి హెచ్చరిక జారీ చేసింది. 

ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత డెల్టా కంటే తక్కువ ఉన్నప్పటికీ.. దీనిని తేలికగా తీసుకోవద్దని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఇలా పరిగణించడం ప్రమాదకరమే అని చెప్పింది. చాలా మంది ఒమిక్రాన్ కు సాధారణ జలుబు లక్షణాలు మాత్రమే ఉన్నాయని భావిస్తున్నారని, ఇది ఎంత మాత్రం నిజం కాదని తేల్చిచెప్పింది. ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, వృద్ధులు ఈ వేరియంట్ బారిన పడితే పరిస్థితి తీవ్రంగా ఉండవచ్చని హెచ్చరిస్తోంది. కేవలం మరణాల రేటు తక్కువగా ఉందని ఒమిక్రాన్ ను లైట్ తీసుకుంటే అత్యంత ప్రమాదకరమని డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ లీడ్ మరియా వాన్ కేర్ఖోవ్ తెలిపారు. 

అమెరికా డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్ చేసిన అధ్యయనంలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో దగ్గు, ఆయాసం, రక్తం గడ్డ కట్టడం, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉన్నట్లు తేలింది. పాత వేరియంట్లు తీవ్రమైన న్యూమోనియాకు దారితీసి ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపగా.. ఒమిక్రాన్ శ్వాస వ్యవస్థ పైభాగంలో ప్రభావం చూపుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అయితే మునుపటి వేరియంట్ల కంటే ఈ ప్రభావం తక్కువేనని పేర్కొంది. ఒమిక్రాన్ కారణంగా ప్రపంచంలో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.    

Leave a Comment