రాష్ట్రంలో అందరికీ మాస్కుల పంపిణీ

ప్రతి వ్యక్తికీ మూడు చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కుల పంపిణీ

సీఎం జగన్‌ ఆదేశాలు

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మాస్కులు పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న  సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీ చేయాలని ఆదేశించారు. మాస్క్‌ల వల్ల కొంత రక్షణ లభిస్తుందన్నారు. వీలైనంత త్వరగా వీటిని పంపిణీ చేయాలన్నారు. 

మూడో సారి సర్వే పూర్తి..

రాష్ట్రంలోని 1.47 కోట్ల కుటుంబాల్లో 1.43 కోట్ల కుటుంబాలపై మూడో సర్వే పూర్తయిందని అధికారులు వెల్లడించారు. 32,349 మందిని వైద్యాధికారులకు ఎన్‌ఎంలు, ఆశావర్కర్లు రిఫర్‌ చేశారు. ఇందులో 9,107 మందికి పరీక్షలు అవసరమని వైద్యాధికారులు నిర్ధారించారు. అయితే మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు.

కోవిడ్‌ కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45వేల కోవిడ్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. వైరస్‌ వ్యాప్తి, ఉద్ధృతిని అంచనా వేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని సీఎంకు వెల్లడించారు. కోవిడ్‌ వ్యాప్తి ఉన్నజోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామని అధికారులు తెలిపారు. 

అప్రమత్తంగా ఉండాలి – సీఎం

హైరిస్కు ఉన్న వారిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. వృద్ధులు, మధుమేహం, బీపీ ఇతరత్రా వ్యాధులతో బాధపడే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో చేర్పించి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. 

ఏపీలో 417 కేసులు..

అలాగే ఆదివారం ఉదయం 9 గంటల వరకు నమోదైన కేసుల వివరాలను అధికారులు సీఎం ముందు ఉంచారు. రాష్ట్రంలో మొత్తం 417 కేసులు నమోదయ్యాయన్నారు. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ కేసులు 13, వారి ద్వారా సోకిన కేసుల సంఖ్య 12, ఢిల్లీ వెళ్లిన వారిలో పాజిటివ్ కేసులు 199, వారి ద్వారా సోకిన వారు 161 ఉన్నాయన్నారు. మిగిలిన పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు వెల్లడం వల్ల వ్యాధి సోకిన వారు, వారి ద్వారా ఇతరత్రా మార్గాల వల్ల కరోనా సోకిన వారు 32 మంది ఉన్నారన్నారు. 

 

Leave a Comment