ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది

 సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం బతికే ఉందా అని అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఏపీలో నియంత పాలన కొనసాగుతోందన్నారు. ఎస్ ఈసీ పదవి నుంచి రమేష కుమార్ ను అప్రజాస్వామ్యంగా తొలగించారన్నారు. రమేష్ కుమార్ కరోనా నుంచి రాష్ట్రాన్ని కాపాడారన్నారు. వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లినప్పటికీ రమేష్ కుమార్ నిర్ణయాన్నే న్యాయస్థానం సమర్థించిందన్నారు. అయితే ఆయనను అర్ధాంతరంగా, అన్యాయంగా తొలగిస్తుంటే గవర్నర్ గంట కూడా ఫైల్ ఆపలేదన్నారు. కనీసం న్యాయ సలహా కూడా తీసుకోలేదన్నారు. 

ఎన్నికల కమిషనర్ ను తొలగించి 85 సంవత్సరాల కనగరాజ్ ను నేరుగా చెన్నై నుంచి తీసుకొస్తే గవర్నర్ చూస్తూ ఊరుకున్నారని విమర్శించారు. తనకు ప్రాణహాని ఉందని రమేష్ కుమార్ భయపడ్డారని, తనకు కూడా హాని పొంచి ఉందని గవర్నర్ భయపడుతున్నారా అని ప్రశ్నించారు.గవర్నర్ తీరును చూస్తుంటే మొత్తం గవర్నర్ వ్యవస్థను రద్దు ఎన్టీఆర్ చెప్పిన మాటలు నేడు గుర్తొస్తున్నాయన్నారు. 

స్టేట్ ఎలక్షన్ కమిషనర్, జాస్తి కృష్ణ కిషోర్, ఏబీ వెంకటేశ్వర రావు, శాసనమండలి అంశాల్లో తొలగింపు, రద్దులతో ముఖ్యమంత్రి ముందుకు పోతున్నారన్నారు. అన్నింట్లో కోర్టు తీర్పులు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చాయన్నారు. రమేష్ కుమార్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన రోజే ఏపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రెండు హైకోర్టు తీర్పులు వచ్చాయని తెలిపారు. వ్యతిరేక తీర్పులు వస్తున్నా  ప్రభుత్వం మొండిగానే ముందుకు పోతోందని విమర్శించారు. 

 

Leave a Comment