కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’.. ఉలిక్కిపడ్డ ప్రపంచం..!

కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. దీంతో ప్రజలు సాధారణ స్థితికి వస్తున్నారు. ఇలాంటి సమయంలో దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. B.1.1.529 అనే కొత్తరకం వేరియంట్ లో అత్యధిక స్థాయిలో మ్యూటేషన్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.. 

ఈ కొత్త వేరియంట్ ఆందోళనకరంగా ఉందంటూ డబ్ల్యూహెచ్ఓ ‘ఒమిక్రాన్’ అని పేరుపెట్టింది. ఈ కొత్త వేరియంట్ కు పెద్ద సంఖ్యలో మ్యూటేషన్లు ఉన్నాయని, దీని వల్ల రీఇన్ఫెక్షన్ ప్రమాదం పెరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. దక్షిణాఫ్రికాలో కనిపించిన ఈ వేరియంట్ పొరుగుదేశం బోట్స్ వానాతో పాటు హాంకాంగ్ కు వ్యాపించింది. తాజాగా ఇజ్రాయెల్, బెల్జియం దేశాల్లోనూ ఈ కేసులు నమోదయ్యాయి. 

అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా వేరియంట్ కంటే ఇది ప్రమాకరమని, వేగంగా వ్యాపించి తీవ్ర లక్షణాలకు దారి తీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికీ ఈ వేరియంట్ సోకుతుండటంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. 

ఈ కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటికే కొన్ని దేశాలు విమానాల రాకపోకలను నిషేధించాయి. ముందస్తు చర్యల్లో భాగంగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే సహా 7 దేశాలపై అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించింది. కొత్త వేరియంట్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ఐరోపా, ఆసియాల్లోని ప్రధాని ఇండెక్స్ లు కుదేలయ్యాయి. 

Leave a Comment