విశాఖ బాధితుడి కుటుంబసభ్యురాలికీ..
ఏపీలో ఆరుకు చేరిన కరోనా కేసులు
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి ఆంధ్రప్రదేశ్‌లో రెండోదశలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలోనే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. బాధితుడి ద్వారా రాష్ట్రంలో తొలిసారి మరో వ్యక్తికి వైరస్ సోకింది. దీన్ని రెండోదశగా పేర్కొంటారు. మక్కా, మదీనా సందర్శనకు వెళ్లిన వృద్ధుడు (65) ఈనెల 12న విశాఖపట్నం వచ్చారు. ఈయన కుటుంబంలో ఒక మహిళ (49) కరోనా లక్షణాలతో ఈనెల 20న ఆస్పత్రిలో చేరగా ఆదివారం కరోనా వైరస్ పాజిటివ్‌గా ధ్రువీకరించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు ఆరుకు చేరాయి.
హైదరాబాద్‌లోనే మూడు రోజులున్న ఒంగోలు యువకుడు
ఒంగోలులో కరోనా పాజిటివ్‌గా వచ్చిన 23 ఏళ్ల యువకుడు ఈనెల 10న బ్రిటన్ నుంచి విమానంలో దిల్లీకి, అక్కడి నుంచి 11న విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లో దిగి.. టాక్సీలో ఎల్లారెడ్డిగూడలోని తన స్నేహితుడి వద్దకు వెళ్లారు. అక్కడే మూడు రోజులపాటు ఉన్నారు. 14వ తేదీ రాత్రి 9గంటలకు క్యాబ్‌లో కేపీహెచ్‌బీ బస్టాప్‌కు వచ్చారు. అక్కడి నుంచి ఒంగోలుకు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు (నంబరు 5020) సీటు నంబరు పీ21లో ప్రయాణించారు. 15న తెల్లవారు జామున 4.20 గంటలకు ఒంగోలులో దిగి.. ఆటోలో తన ఇంటికి చేరుకున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో కుటుంబసభ్యులతో కలిసి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. అదేరోజు తిరిగి వచ్చిన ఆయన ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో చేరారు. 17న కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఈయన కలిసిన వారందర్నీ వైద్య సిబ్బంది గుర్తించారు.
24 గంటల్లో ఆస్పత్రుల్లో 27 మంది చేరిక
గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా లక్షణాలతో 27 మంది ఆస్పత్రుల్లో చేరారు. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో మొత్తం 53 మంది ఉన్నారు.
* కరోనా వైరస్ వైద్య పరీక్షలు: 164
* పాజిటివ్: 6 (నెల్లూరు యువకుడితో కలిపి)
* నెగిటివ్: 142
* పరీక్షల ఫలితాలు రావాల్సింది: 16