ఏపీలో 23కు చేరిన కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం, కాకినాడలో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాకినాడలో 49 ఏళ్ల వ్యక్తికి, రాజమహేంద్రవరంలో 72 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకినట్లు చెప్పారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 23కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా సోకినవారిలో నెల్లూరు, విశాఖ నుంచి ఒకొక్కరు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

ఆదివారం 2 పాజిటివ్‌ కేసులు విశాఖలో నమోదయ్యాయి. బర్మింగ్‌హామ్‌ నుంచి విశాఖకు ఈ నెల 17వ తేదీన వచ్చిన వ్యక్తి ద్వారా ఇద్దరికి వైరస్‌ సంక్రమించిందని వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు కరోనా కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతోంది.

మరోవైపు ఇప్పటి వరకు మొత్తం 649 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించగా అందులో 23 పాజిటివ్‌, 526 నెగటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 100 మంది అనుమానితుల నమూనాల ఫలితాల కోసం వేచిచూస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా ఇప్పటి వరకు విదేశాల నుంచి 29,672 మంది ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. వారిల 29,494 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా.. 178మందికి ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించింది.  

జిల్లాల వారీగా నమోదైన కేసులు.. 

విశాఖ 6

కృష్ణా 4

గుంటూరు 4

ప్రకాశం 3

తూర్పుగోదావరి జిల్లా 3

చిత్తూరు 1

కర్నూలు 1

నెల్లూరు 1 చొప్పున బాధితులు చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది

 

Leave a Comment