మత్స్యకార భరోసాను ప్రారంభించిన సీఎం జగన్

కరోనాతో పోరాడుతున్న సమయంలో కూడా, ఇన్ని కష్టాలు ఉన్నా సరే.. తమకున్న కష్టాల కన్నా మత్స్యకారుల కష్టాలు పెద్దవి అని భావించి ఇవాళ మత్స్యకార భరోసాను మరోసారి ఇస్తున్నామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.  బుధవారం క్యాంపు కార్యాలయంలో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 

చేపల వేట నిషేధ సమయంలో చాలీచాలని విధంగా రూ.4 వేలు ఇచ్చేవారని, కానీ మత్స్యకారుల బతుకులు మారాలని తలచి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని సీఎం తెలిపారు. 

మత్స్యకారుల కోసం నవంబర్ లోనే మత్స్యకార భరోసాకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో పాకిస్తాన్ లో ప్రవేశించిన మన మత్స్యకారులను అరెస్టు చేశారనే విషయాన్ని తనకు చెప్పారని, వారిని విడుదల చేయించామని చెప్పారు. 

కరోనా కారణంగా గుజరాత్‌లో 4500 మందికి పైగా మత్స్యకారులు చిక్కుకుపోతే, గుజరాత్‌ సీఎంతో పాటు, కేంద్ర మంత్రులతో మాట్లాడి, రూ.3 కోట్ల మేర ఖర్చు చేసి.. వారందరినీ సురక్షితంగా తీసుకువచ్చామన్నారు. వారందరికీ పరీక్షలు చేసి రూ.2 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశామన్నారు. 

ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు చేపల వేటపై ఉండే నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన డబ్బును గతంలో ఎప్పుడూ ఇచ్చే వారు కాదని, ఇప్పుడు కరోనా కష్టాలు ఉన్నా కూడా నేడు 1,09,231 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఇస్తున్నామని స్పష్టం చేశారు. 

శాశ్వత చర్యలకు శ్రీకారం..

మత్స్యకారుల జీవితాల్లో శాశ్వతంగా మార్పు రావాలని, గుజరాత్‌ లాంటి ప్రాంతాలకు వలస పోకూడదని, శాశ్వత చర్యలను చేపడుతున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నం, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్‌ హార్బర్లు నిర్మించబోతున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మంచి నీళ్లపేటలో ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాన్ని కట్టబోతున్నామని తెలిపారు. 

 

Leave a Comment