అధిక ధరలకు అమ్మితే శిక్ష తప్పదు : సీఎం జగన్‌

అమరావతి : నిత్యావసరాల వస్తువలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ప్రకటించిన ధరల కంటే ఎక్కువ ధరకు అమ్మితే  జైలుకు పంపుతామన్నారు. కరోనావైరస్‌ నివారణ చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డీఓలు, ఎస్పీలతో సోమవారం సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వచ్చే 15 రోజులకు నిత్యావసరాల వస్తువుల ధరలను ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ప్రకటించిన ధరకంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సూపర్‌ మార్కెట్లలో కూడా ఇవే ధరలకు విక్రయించాలని ఆదేశించారు. ప్రతి దుకాణం వద్దా డిస్‌ప్లే బోర్టులు ఉండాలని, దాంట్లో ఫిర్యాదు చేయాల్సిన కాల్‌ సెంటర్‌ నంబర్‌ కూడా ఉంచాలని సూచించారు.  కుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఉత్పతుల తరలింపు మీద, గూడ్స్‌మీద ఆంక్షలు పెట్టకూడదని, సరుకుల రవాణాను అడ్డుకోవద్దని సూచించారు. 

ప్రతిరోజూ ప్రతి కుటుంబాన్ని పరిశీలించాలి.. 

రెండు రకాల బృందాలతో కోవిడ్‌–19 నివారణా చర్యలను పటిష్టంగా చేపట్టాలన్నారు. మొదటి దశ టీంలో వార్డు వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాల ప్రైమరీ రీసోర్స్‌ పర్సన్లు, వార్డు సచివాలయంలో ఉండే హెల్త్‌ సెక్రటరీ, అదనపు ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ ఉంటారన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నా, లేకున్నా.. ప్రతి ఇంటి మీదా వీరు దృష్టి పెట్టాలన్నారు. ప్రతి ఇంటినీ సర్వే చేసి వైరస్‌ లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలన్నారు. ప్రతిరోజూ ప్రతి కుటుంబాన్ని పరిశీలించాలి. 

ఇక  రెండో స్థాయిలో ప్రతి వార్డుకూ ఒక వైద్యుడ్ని ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాల్టీల్లో ప్రతి మూడు వార్డులకు ఒక డాక్టర్‌ను ఉంచాలన్నారు. మొదటి స్థాయి టీం నుంచి వచ్చే డేటాను ప్రతిరోజూ మానిటర్‌ చేసి ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. 

ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచుతున్నాం .. 

కోవిడ్‌-19 క్రిటికల్‌ కేసుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేయాలన్నారు. వీటితోపాటు ఆస్పత్రుల పర్యవేక్షణ కూడా చాలా కీలకమన్నారు. వైరస్‌ సోకిన వారిలో దాదాపుగా 5శాతం కేసులు సంక్లిష్టంగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు.

విశాఖలో విమ్స్, కృష్ణా జిల్లాలో సిదార్థ హాస్పటిల్, నెల్లూరులో జీజీహెచ్, తిరుపతిలో పద్మావతి ఆస్పత్రుల్లో  క్రిటికల్‌ కేర్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఈ నాలుగు ప్రధాన ఆస్పత్రుల్లో 1370 బెడ్ల సంఖ్యను 1680కు పెంచుతున్నామన్నారు. అలాగే వెంటిలేటర్లతో కూడి బెడ్ల సంఖ్యను 148 నుంచి 444కు పెంచుతున్నామని జగన్ తెలిపారు.

జిల్లాల్లో ప్రత్యేక ఆస్పత్రులు 

కరోనా సోకిన దాదాపు 15 శాతం కేసులు ఆస్పత్రిల్లో చేర్పించాల్సి ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయన్నారు. దీని కోసం జిల్లాల వారీగా కూడా ఆస్పత్రులను, అందులో సౌకర్యాలను పెంచుతున్నామని తెలిపారు.  విజయనగరంలో మిమ్స్‌ ఆస్పత్రిలో నాన్‌ ఐసీయూ బెడ్స్‌ 780 నుంచి 900 కు, ఐసీయూ బెడ్స్‌ను 25 నుంచి 50 కి పెంచుతున్నామన్నారు.

విశాఖపట్నంలోని గీతం ఆస్పత్రిలో ప్రస్తుతం నాన్‌ ఐసీయూ బెడ్స్‌ 400 బెడ్లను 600కు, ఐసీయూ బెడ్స్‌ను 14 నుంచి 25కు పెంచుతున్నారు.ఈస్ట్‌ గోదావరిలో కిమ్స్‌ ఆస్పత్రిలో నాన్‌ ఐసీయూ బెడ్స్‌ 730 నుంచి 800కు, ఐసీయూ 52 నుంచి 70కి పెంచుతున్నాం. పశ్చిమ గోదావరిలో ఆశ్రమం ఆస్పత్రిలో నాన్‌ ఐసీయూ బెడ్స్‌ 400 నుంచి 500కు, ఐసీయూ బెడ్స్‌ను 13 నుంచి 50 కి పెంచుతున్నామని తెలిపారు. 

విజయవాడలో పిన్నమనేని ఆస్పత్రిలో 600 నుంచి 800కు, ఐసీయూ బెడ్స్‌ 12 నుంచి 25 పెంచుతున్నామన్నారు. గుంటూరు ఎన్నారై ఆస్పత్రిలో నాన్‌ ఐసీయూ బెడ్స్‌ 400 నుంచి 500కు, ఐసీయూ బెడ్స్‌ 50 నుంచి 60కి, ప్రకాశం జిల్లాలోని కిమ్స్‌ ఆస్పత్రిలో 150 నుంచి 200కు, ఐసీయూ బెడ్స్‌ను 70 నుంచి 80కి, నెల్లూరు సింహపురి ఆస్పత్రిలో నాన్‌ ఐసీయూ 200 నుంచి 250, ఐసీయూను 10 ని 20కి పెంచుతున్నామన్నారు. 

 చిత్తూరులోని అపోలో అస్పత్రిలో ప్రస్తుతం 800 నాన్‌ఐసీయూ బెడ్స్‌ ఉండగా,  ఐసీయూ బెడ్స్‌ 15 ను 25కి, కడపలోని ఫాతిమా ఆస్పత్రిలో నాన్‌ ఐసీయూ బెడ్స్‌ 700 నుంచి 800కి, ఐసీయూ ఐసీయూను 4నుంచి 10కి, కర్నూలు జిల్లాలో శాంతిరాం ఆస్పత్రిని నాన్‌ ఐసీయూ బెడ్లు 700 నుంచి 800కు, ఐసీయూ బెడ్లు 36 నుంచి 50కి, అనంతపురంలో సవేరా ఆస్పత్రిలో నాన్‌ ఐసీయూ బెడ్లు 200 నుంచి 300కి, ఐసీయూను 19 నుంచి 25కి పెంచుతున్నామని పేర్కొన్నారు. 

శ్రీకాకుళంలో జెమ్స్‌లో నాన్‌ ఐసీయూ బెడ్లు 702 నుంచి 800కు, ఐసీయూ బెడ్లను 16 నుంచి 25కు, ఐసీయూ బెడ్లు 15 నుంచి 20కి,   మొత్తమ్మీద ఈ ఆస్పత్రుల్లో 6762 బెడ్ల సామర్థ్యాన్ని 8050కి నాన్‌ ఐసీయూ బెడ్లను, ఐసీయూ బెడ్లను 336 నుంచి 515కు పెంచుతున్నామన్నారు.

క్వారంటైన్‌ కోసం ప్రతి జిల్లాలో 5వేల బెడ్లు 

ప్రతి నియోజకవర్గంలో క్వారంటైన్‌ సదుపాయాలను కూడా కల్పించామన్నారు. ప్రతి క్వారంటైన్‌ సదుపాయం వద్ద ఒక వైద్య బృందం ఉంటుందన్నారు. జిల్లా వారీగా క్వారంటైన్‌ కోసం 16,723 పడకలు ఇప్పటికే ఏర్పాటు చేశామని, వీటి సంఖ్యను బాగా పెంచాలని అన్నారు. ప్రతిజిల్లాలో కనీసం 5వేల బెడ్లు క్వారంటైన్, ఐసోలేషన్‌ కోసం ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి

నిల్వ చేయలేని పంటల విషయంలో రైతులకు సమస్యలు రాకూడదని,  వీరికి గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని చెప్పారు. నిల్వచేసుకునే పంటల విషయంలో రైతులకు సలహాలు ఇవ్వాలన్నారు. వ్యవసాయం, మార్కెటింగ్‌ అధికారులు దీనిపై దృష్టిపెట్టాలన్నారు.

 

Leave a Comment