అధికారం నాదా..ఈసీదా ? : సీఎం జగన్ 

తాడేపల్లి : కరోనా వైరస్ పై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆదివారం తాడేపల్లిలోని విడిది కార్యాలయంలో సీఎం జగన్ తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా భయానకం ఏమీ కాదని, కేవలం రెండు మూడు వారాల్లో పరిస్థితి మారిపోదని అన్నారు. నిరంతర ప్రక్రియగా ఏడాది పాటు జరగాల్సి ఉందన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మన పనులు చేసుకోవాలన్నారు. విశాఖపట్నంలో 200, విజయవాడలో 50 పడకల వార్డులు సిద్ధంగా ఉన్నాయన్నారు. గ్రామ వలంటీర్లతో ప్రతి ఇల్లు సర్వే చేయిస్తున్నామన్నారు. 

విచక్షణ కోల్పోయిన ఈసీ..

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయి వ్యవహరించారని సీఎం జగన్ విమర్శించారు. ఈసీ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. చంద్రబాబు దగ్గరుండి వ్యవస్థలను నీరుగారుస్తున్నారన్నారు. కులాలు మతాలకు  అతీతంగా ఎన్నికల కమిషనర్ వ్యవహరించాలన్నారు. ఒకవైపు కరోనా ఎఫెక్టుతో ఎన్నికలు వాయిదా అంటూనే అధికారులను తప్పిస్తూ వ్యాఖ్యలు చేశారన్నారు. మరోవైపు కలెక్టర్లు అధికారులను బదిలీ చేయటం ఎంతవరకు సబబని, రమేష్ కుమార్ కు ఇలా వ్యవహరించే అధికారం ఎక్కడిదని, అధికారం ముఖ్యమంత్రిదా లేదా ఈసీదా అని ప్రశ్నించారు. ఎవరో రాసి ఆర్డర్లు ఇస్తే ఈయన చదువుతున్నారని ఆరోపించారు. 

ఎవరిని అడిగారు..

ఎన్నికలు వాయిదా వేసేముందు ఎవరినైనా అడిగారా అని ప్రశ్నించారు. కనీసం హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రెటరీ ని పిలిచి ఎందుకు అడగలేదన్నారు. చివరకు పేదలకు ఇళ్ల పట్టాల ప్రక్రియను కూడా ఆపేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రజలు ఓట్లు వేసి 151 స్థానాలు ఇస్తేనే వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇంత వివక్ష చూపటం ధర్మమేనా, ఇది సరైందేనా చంద్రబాబు పదవి ఇచ్చినంత మాత్రాన ఇంత వివక్ష చూపుతారా అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

 

Leave a Comment