విశాఖలో చంద్రబాబు అరెస్ట్‌

విశాఖ : టీడీపీ అధినేత చంద్రబాబును విశాఖ పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. విశాఖ వెస్ట్‌జోన్‌ ఏసీపీ పేరుతో సెక్షన్‌ 151 కింద ఆయనకు పోలీసులు నోటీసు ఇచ్చారు. భద్రత దృష్ట్యా ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అనంతరం తీవ్ర ఉద్రిక్తత నడుమ ఆయన్ను అదుపులోకి తీసుకుని తిరిగి విశాఖ విమానాశ్రయంలోనికి తరలించారు. అక్కడ వీఐపీ లాంజ్‌లో ఆయన్ను ఉంచారు. వీఐపీ లాంజ్‌లో సుమారు అరగంటసేపు ఉంచే అవకాశముంది. ఆ తర్వాత చంద్రబాబును విమానాశ్రయం నుంచి విజయవాడ లేదా హైదరాబాద్‌ పంపిస్తారా? విశాఖలోనే ఇతర ప్రాంతానికి తరలిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. 

ఉదయం నుంచి విశాఖ విమానాశ్రయం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు విమానాశ్రయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు కూడా పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ చేరుకున్న చంద్రబాబు విమానాశ్రయం బయట తన కాన్వాయ్‌లోనే సుమారు మూడు గంటలసేపు ఉండిపోయారు. అనంతరం వాహనం నుంచి దిగి పోలీసుల వైఖరిని నిరసిస్తూ అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. అనంతరం కొద్దిసేపటికే పోలీసులు ఆయన్ను ముందస్తు అరెస్ట్‌ చేశారు.

 

Leave a Comment