సీఏఏ, ఎన్ఆర్సీ ప్రమాదకరం

సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆలం

అమరావతి : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అఫ్తాబ్ ఆలం అన్నారు. పౌరసత్వ చట్టంలో దేశాన్ని చీల్చడం జరుగుతుందన్నారు. శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) 10వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేంలో జస్టిస్ ఆలం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మతపరమైన వివిక్ష ప్రజాస్వామ్యానికి హానికరమని చెప్పారు. ఈ చట్టాలను వ్యతిరేకించే వారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం తగదని తెలిపారు. నిరసన అన్న పదం ప్రస్తుతం ఓ ఆమోదయోగ్యం కాని పదంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశ పౌరులుగా జీవిస్తూ, ప్రతి వ్యక్తి తాను ఈ దేశ పౌరుడినని నిరూపించుకోవాలనడం దౌర్భాగ్యమన్నారు. 

ప్రజాస్వామ్యానికి న్యాయస్థానాలు ఆయువుపట్టు అని, అలాంటి న్యాయస్థానాల మనుగడకు ప్రజల విశ్వాసమే ఆధారమని అన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం సడలకుండా కాపాడుకోల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి మాట్లాడుతూ రాజ్యాంగ హక్కలు పరిరక్షిస్తూ, ప్రజాస్వామ్యాన్ని బతికించే విషయంలో న్యాయవాదులు ప్రధాన భూమిక పోషించాలని కోరారు. న్యాయవ్యవస్థకు విశిష్ట సేవలు అందించిన న్యాయకోవిదులు వి.కె.క్రిష్ణయ్యర్, పద్మనాభరెడ్డి వంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఐఏఎల్ స్థాపించారని, వారి ఆదర్శాలతో న్యాయవాదులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

 

Leave a Comment